నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ ( Nagarkurnool ) నియోజకవర్గంలో మొక్క జొన్న కొనుగోలులో అవినీతికి పాల్పడ్డ మార్కెట్ చైర్మన్( Market Committee Chairman ) పై విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన నాయకులను అరెస్టు చేయడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ నాయకులు ( BRS Leaders ) విమర్శించారు. బుధవారం నాగర్‌కర్నూల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతిపరుడు మార్కెట్ కమిటీ చైర్మన్‌ను కాపాడుతున్న ఎమ్మెల్యేకు రైతుల పట్ల ఉన్న ప్రేమ అర్ధమవుతుందని ఆరోపించారు. రైతుల పట్ల అభిమానం ఉంటే మార్కెట్ చైర్మన్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రైతు బంధు, రుణ మాఫీ, సకాలంలో యూరియా ఇవ్వకుండా రైతుల నోట్ల మట్టి కొట్టి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ భూముల్లో కూడా ఆక్రమణలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పొట్టకొట్టిన అవినీతి పరులను బొక్కలోకి పంపేంత వరకు విశ్రమించబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ చిక్కొండ్ర శ్రీశైలం, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కొండకింది మాధవ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నల్లగంటి వెంకటయ్య, మాజీ సర్పంచులు చిక్కొండ్ర నాగయ్య, అతినారపు విష్ణు , నాయకులు కిషోర్ గౌడ్, అవంచ సత్యం, శేఖర్, కట్ట వంశీ గౌడ్, గుంటి బాలు, గొడుగు యాది, తదితరులు పాల్గొన్నారు.