మానవపాడు, ఫిబ్రవరి 27 : తరగతిగదిలో ఆడుకుంటుండగా విద్యార్థి తలకు బలమైన గాయమైన ఘటన మానవపాడు మండలకేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో చోటుచేసుకున్నది. వివరాలిలా.. మంగళవారం మధ్యాహ్నం మూడుగంటల సమయంలో తరగతిగదిలోకి టీచర్ రాకపోవడంతో 8వ తరగతి విద్యార్థులు ప్యాడ్లు విసురుతూ ఆడుకుంటున్నారు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు పరీక్ష ప్యా డ్ వెంకటేశ్ తలకు తగిలి బలమైన గాయమైంది.
గమనించిన తోటి విద్యార్థులు వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స చేయించారు. అయితే విద్యార్థికి బలమైన గాయమైనా ఉపాధ్యాయులకు విషయం తెలియకపోవడం విస్మయానికి గురి చేస్తున్నది. ఘటనకు సంబంధించి హెచ్ఎంను చరవాణిలో ఆరా తీసే ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు.