కొల్లాపూర్, జూన్ 27 : కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలను నమ్మి మోసపోయిన ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తిరగబడే రోజు దగ్గరలోనే ఉన్నాయని, రైతులు, ప్రజలను గుండెలో పెట్టుకొని చూసుకున్న కేసీఆర్ సర్కారు మళ్లీ రావాలని ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురూ చూస్తున్నారని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని కుడికిళ్ల గ్రామంలో శనివారం బీఆర్ఎస్ ముఖ్యనాయకులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని సర్ ప్రక్రియపై అవగాహన కల్పించడంతోపాటు, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో రైతులు నాట్లు వేస్తున్నప్పుడే రైతుబంధు పడేదని ఇప్పుడు ఓట్లు ఉన్నప్పుడు రైతు బంధు పడుతోందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ఒకసారి, పంచాయతీ ఎన్నికలకు ఒకసారి ఇచ్చి ఇప్పటికి మూడుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధును ఎగ్గొట్టిందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని పిలుపునిచ్చారు. సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ నాయకులకు సూచించారు. బీఎల్వోల వెంట ఉండి ఓటరు జాబితా ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించారు. అర్హత కలిగిన ఏ ఒక్కరి ఓటు కోల్పోకుండా చూడాలన్నారు. సమావేశంలో మాజీ ప్రజా ప్రతినిధిలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.