భూత్పూర్, సెప్టెంబర్ 18 : మండలంలోని కొత్తమొల్గర శివారులోని తుల్జాభవాని తండా సమీపంలో గురువారం ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. ఎస్సై వివరాల మేరకు.. భూత్పూర్ నుంచి ఓ ఆటో వెళ్తుండగా ఖిల్లాఘణపురం నుంచి మరో ఆటో వస్తూ తుల్జాభవాని తండా సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఖిల్లాఘణపురం వైపు నుంచి వచ్చే ఆటోలో డ్రైవర్‌తోపాటు నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఇందులో ఖిల్లాఘణఫురం మండలం గట్టుకాడిపల్లికి చెందిన వంశీ(23), భూత్పూర్ మండలం పోతులమడుగుకు చెందిన చౌదరి నర్సింహారెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. పెద్దమందడి మండలంలోని దొంతికుంటతండాకు చెందిన సక్రీ చికిత్స పొందుతూ జిల్లా దవాఖానలో మృతిచెందింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.