జడ్చర్ల, మే 21 : ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలతో రైతన్నలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గురువారం జడ్చర్లలో కురిసిన భారీ వర్షానికి జడ్చర్లలోని పత్తిమార్కెట్ యార్డులోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన మొక్కజొన్న, ధాన్యం పూర్తిగా తడిపోయింది. కొనుగోలు కేంద్రంలో మక్కలను సకాలంలో కొనుగోలు చేయకపోవడంతోనే వర్షానికి తడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలు చేతికందే సమయంలో వరుణుడి ఉగ్రరూపంతో రైతన్నలు కుదేలవుతున్నారు.
గురువారం జడ్చర్లలో కురిసిన భారీ వర్షానికి జడ్చర్లలోని పత్తిమార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రంలో, బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులలో ఉన్న వరిధాన్యం, మొక్కజొన్నబస్తాలోతో పాటు కుప్పలు, ఇతర సరుకులు తడిసిపోయాయి. ముఖ్యంగా పత్తి మార్కెట్లోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో రైతులు తీసుకువచ్చి మొక్కజొన్న భారీ వర్షానికి పూర్తిగా తడిసి ముద్దయింది. దాంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఎంతో ఖర్చుచేసి పండించిన పంటల ఉత్పత్తులు అమ్ముకోవడానికి మార్కెట్లోని కొనుగోలు కేంద్రానికి వస్తే అధికారులు కొనుగోలు చేయక పోవడంతో ఆరుబయటే మక్కలను ఉంచాల్సి వస్తోంది. అదేవిధంగా కొనుగోలు చేసిన మక్కల బస్తాలు కూడా ఆరుబయటే ఉన్నాయి. ఈ సమయంలో భారీ వర్షం కురవడంతో పత్తిమార్కెట్లో ఉన్న మొక్కజొన్న పూర్తిగా తడిపోయింది.

అదేవిధంగా తూకం వేసిన బస్తాలు ఆరుబయటే ఉండడంతో వాటి కిందిభాగం నుంచి వర్షపు నీరువెళ్లడంతో అవి తడిసి పోయాయి. ఆరబెట్టడానికి పత్తి మార్కెట్కు రైతులు ధాన్యంను తీసుకువస్తే అవి కూడి వర్షం దాటికి తడిసి ముద్దయ్యాయి. నెలరోజులుగా మక్కలను తీసుకువచ్చిన రైతులు మార్కెట్లోనే జాగరణ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం రైతుల మీద కరుణ చూపడంలేదని ఆవేదన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన మక్కలను కొనుగోలు చేయకపోవడం, కొనుగోలు చేసిన బస్తాలను ఎత్తక పోవడం వలలనే తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలకు తడిసిన మొక్కజొన్నతో పాటు ధాన్యంను కూడా కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
అకాల వర్షాలకు తడిసిన మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేయాలి. మక్కల కొనుగోలు కేంద్రానికి అమ్మకానికి మక్కలను తీసుకు వస్తే వారు సకాలంలో కొనుగోలు చేయక పోవడం వల్లే వర్షానికి తడిసి పోయాయి. రెండు మూడు రోజుల కిందట కురిసిన భారీ వర్షానికి రైతులు తీసుకువచ్చిన మక్కలు తడిసిపోవడం జరిగిందని మళ్లీ వర్షం కురవడంతో మక్కలు, వరిధాన్యం పూర్తిగా తడిసిపోయాయి. అకాల వర్షాలకు తడిసిన మక్కలను, ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలి.
– కొమురయ్య, రైతు, కోడుపర్తి, జడ్చర్ల మండలం