హన్వాడ, ఏప్రిల్ 2 : యాసంగి పంటల సాగు రైతులకు కన్నీళ్లను మిగుల్చుతున్నది. ఓవైపు కరెంట్ సమస్యలు.. మరోవైపు సాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. దీంతో ప్రస్తుతం చేతికొచ్చిన వరి, ఇతర పంటలు ఎండిపోతుండగా.. ప్రస్తుతం కూరగాయల తోటలు సైతం దెబ్బతింటున్నాయి.
హన్వాడ మండలంలో పెద్ద ఎత్తున రైతులు కూరగాయలు సాగు చేస్తుంటారు. అయితే ఈసారి సాగునీళ్లు అందక చివరి దశలో ఉన్న పంటలు చేతికందే పరిస్థితులు లేవు. హన్వాడ శివారులో రైతు యాదయ్యకు చెందిన టమాట, వంకాయ పంటల ఎండిపోవడంతో మూగజీవాల మేతకు వదిలేశాడు. అలాగే బీరకాయ కాయలు పట్టే ముందు నీళ్లు అందని పరిస్థితి.
ఇలా మండలంలోని అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పెట్టుబడులకు వేలకు వేలు అప్పులు తెచ్చి పెడితే చేతికొచ్చిన పంట కండ్ల ఎదుటే ఎండిపోతుంటే గుండె చెరువవుతున్నదని అన్నదాతలు వాపోతున్నారు. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.