వనపర్తి, మే 30 (నమస్తే తెలంగాణ) : ఐదు వరి సీజన్లకు సంబంధించిన కమీషన్ రెండేళ్లుగా పెండింగ్ పడింది. పీఏసీసీఎస్లు, ఐకేపీ, మహిళా సంఘాల ద్వారా వనపర్తి జిల్లాలో ప్రతి ఏటా వానకాలం, యాసంగికి సంబంధించి రెండు సీజన్లు వరి కొనుగోళ్లు జరగడం సహజమే. పంట సాగు చేసిన రైతులకు క్వింటాకు రూ.32 చొప్పున కమీషన్‌ను జిల్లా పౌరసరఫరాల శాఖ అందిస్తుంది. ప్రతి సీజన్‌కు ఇవ్వకపోయినా రెండు, మూడు సీజన్లకు ఒకసారి డబ్బులను క్లియర్ చేసుకుంటూ రావడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తు తం ఎక్కువ సీజన్లకు సంబంధించి డబ్బులు రావాల్సి ఉండగా.. వీటిలో మూడు సీజన్లను క్లియర్ చేశారు. అయినా, ఆయా సొసైటీలకు డబ్బులు అందక పోవడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి.
వనపర్తి జిల్లాలో 15 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. వీటి నుంచి ఏటా వరి కొనుగోళ్లు చేపడుతున్నారు. గతంలో అధిక శాతం అన్ని మండలాల్లోని పీఏసీసీఎస్‌ల నుంచి కొనుగోళ్లు కొనసాగాయి. జిల్లాలో ఒక్కోసారి ఒక్కో తీరులో సెంటర్లు పని చేస్తూ వస్తున్నాయి. కొనుగోళ్లు జరిపిన ధాన్యం లెక్కలను పరిగణలోకి తీసుకుని కమీషన్లను పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఏటా లక్షలాది క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు జరుగుతుండడంతో కమీషన్లు సైతం అదేస్థాయిలో ప్రాథమిక సహకార సంఘాలకు అందుతాయి. అయితే, కొనుగోళ్ల సమయంలో ఈ కేంద్రాల ద్వారా విక్రయాలకు అవసరమైన సామాగ్రిని పీఏసీసీఎస్‌ల ద్వారా కొనుగోలు చేయడం వంటివి చేపడుతారు.
ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ధాన్యం కొనుగోళ్ల కమీషన్ డబ్బులు వచ్చినప్పటికీ ఇవ్వకుండా పెండింగ్ పెట్టడంపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడు వచ్చినా వారం రోజుల్లో ఆయా పీఏసీసీఎస్లకు పంపిణీ చేసేవారు. అయితే, ఇప్పుడు మా త్రం రెండు నెలలు కావస్తున్నా.. కూడా కావాలనే నిలుపు చేశారన్న ఆరోపణలు జోరందుకున్నాయి. ఎ న్నో సీజన్ల నుంచి పెండింగ్‌లో ఉన్న డబ్బులు రానప్పుడు సరే అనుకున్నా.. వచ్చిన తర్వాత కూడా ఇలా తాత్సారం చేయడంపై అసహనం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలోనూ పై మూడు సీజన్ల వారీ గా డబ్బులు ఒకేసారి విడుదల కాగా, ఒక్క వనపర్తి మినహా అన్ని జిల్లాల్లోనూ పీఏసీసీఎస్‌ల అకౌంట్లలో జమైనట్లు తెలిసింది. ఇక్కడ మాత్రం కావాలనే పెండింగ్ పెట్టినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
వనపర్తి జిల్లాలోని పీఏసీఎస్‌లకు ధాన్యం కొనుగోలు కమీషన్ డబ్బులకు సంబంధించి శనివారం ‘నమస్తే తెలంగాణ’ జిల్లా సహకార కార్యాలయంలో ఆరా తీసింది. జిల్లా అధికారిణి రాణి గురించి మధ్యా హ్నం ఒంటి గంటకు వాకబు చేయగా.. కలెక్ట
రేట్లో మీటింగ్‌కు వెళ్లారని మహిళా అటెండర్ తెలిపింది. మళ్లీ సాయంత్రం 4 గంటలకు ఫోన్లో డీసీవోను కమీషన్ డబ్బులు
వచ్చాయా..? రాలేదా? అని సంప్ర దించగా తాను మంత్రి కార్యక్ర మానికి గానూ మహబూ బ్‌నగర్‌కు వచ్చినట్లు ఫోన్లో చెప్పి
పెట్టేశారు.
ఐదు సీజన్ల వారీగా పీఏసీసీఎస్లకు పెండింగ్ ఉన్న కమీషన్లను మూడు సీజన్లకు సంబంధించి జిల్లా పౌరసరఫరాల శాఖ క్లియర్ చేసింది. జిల్లాలోని 15 పీఏసీసీఎస్లకు ఏప్రిల్‌కు సంబం ధించిన రూ.12 కోట్లు జిల్లా సహకార కార్యాలయానికి అందజేశారు. మూడు సీజన్ల వారీగా వానకాలం-2024 సీజన్‌కు రూ.3,82,42,793, అలాగే యాసంగి-2024 సీజన్‌కు రూ.5,08,00,421, వానకాలం-2025కు సంబంధించి రూ.3,03,87,015 (70 శాతం) డబ్బులను జిల్లా పౌరసరఫరాల శాఖ విడుదల చేసింది. ఇలా వచ్చిన మొత్తాన్ని ఆయా పీఏసీ సీఎస్ల వారీగా లెక్కలు చూసి అకౌంట్లకు చేర్చాల్సిన అధికారులు పెండింగ్ పెట్టేశారు. దాదాపు రెండు నెలలు కావస్తున్నా వాటి గురించి ఆలోచించడమే మానేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. వివిధ కారణాలు చూపెడుతూ చుక్కలు చూపెడుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు.