వేసవి ప్రారంభంలోనే భూగర్భ జలాలు గణనీయంగా తగ్గుతున్నాయి. బోర్లు, బావులు ఇంకిపోతున్నాయి. కాల్వలు, వట్టిబోగా.. చెరువులు అడుగంటాయి. దీంతో రైతులకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. చాలా చోట్ల యాసంగి పంటలకు నీళ్లందక ఎండిపోగా.. మరికొన్ని చోట్ల వాడుతున్నాయి. చేతికొచ్చిన పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. చి‘వరి’కి ఆశలు వదలుకొని పంటలను మేతకు వదిలేశారు.
– నెట్వర్క్ మహబూబ్నగర్, మార్చి 26
ఎండబెట్టిన పాపం పాలకులదే..
వంగూరు, మార్చి 26 : ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చే దశలో ఎండిపోయిందని, పంటలు ఎండబెట్టిన పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని రైతులు ఆరోపిస్తున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో పంటలు ఎండిన దాఖలాలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంకా రైతులను అష్టకష్టాలు పెట్టడంతోపాటు సాగునీరు వనరులను గాలికొదిలేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంగూరు మండలం గాజర గ్రామంలో చింతకుంట్ల కృష్ణయ్య అనే రైతు తన సోదరులతో కలిసి మూడు ఎకరాల్లో వరి సాగు చేశాడు.
వీరిది నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టు వెనుకాల వంగూరు మండలం గాజర గ్రామ శివారులో ఉన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంజీఎల్ఐ కాల్వ ద్వారా నిత్యం కృష్ణమ్మ నీటిని పారించడంతో డిండి ప్రాజెక్టు నిండు కుండలా ఉండేది. దీంతో వంగూరు మండలం గాజర, తిరుమలగిరి, తిప్పారెడ్డిపల్లి, నిజాంబాద్, ఉమ్మాపూర్ రైతులు యాసంగిలో వరిని సాగు చేసేవారు. గత ప్రభుత్వంలో ఎప్పుడు యాసంగిలో డిండి ప్రాజెక్టు ద్వారా నల్లగొండ రైతులకు నీటిని విడుదల చేసేవారు కాదు.
కేవలం వానకాలం మాత్రమే నీటిని విడుదల చేసేవారు. యాసంగిలో నీటిని ప్రాజెక్టులో రిజర్వు చేసేవారు. దీంతో వంగూరు మండల రైతులకు ఎంతో ఉపయోగపడేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల ప్రభావం అధికంగా ఉండడంతో నీటిని యథేచ్ఛగా విడుదల చేసుకోవడంతో మండల రైతుల పంటల ఎండిపోతున్నాయి. కానీ ఇక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమాత్రం స్పందించకపోవడంతో రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి.
డిండిని నమ్మి పంట వేశాను
డిండి ప్రాజెక్టులోని కృష్ణా నీటిని నమ్మి మా అన్నదమ్ములం మూడు ఎకరాల్లో వరి సాగు చేశాం. ప్రాజెక్టు నుంచి నల్లగొండ పాలకు లు నీటిని విడుదల చేసుకుని పోతుండడంతో నీరు ఖా ళీ అవుతుంది. దీంతో మా పంటలు ఎండిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అచ్చంపేట ఎమ్మెల్యే స్పందించి మా పంటలను కాపాడాలని కోరుతున్నాం.
-కృష్ణయ్య, రైతు, గాజర, వంగూరు మండల
కాల్వ నీళ్లు వస్తాయని నమ్మి మోసపోయా..
కాల్వ కింద పొలంలో పది ఎకరాల్లో వేరుశనగా పంట వేశాను. మొదట్లో కేఎల్ఐ ద్వారా నీళ్లు బాగానే వస్తున్నాయని సంతోషపడ్డాను. ఆ ఆనందం కొన్ని రోజలు మాత్రమే ఉన్నది. ఇప్పటికి 60 రోజులు గడిచినా కాల్వకు నీరు వదలకం పోవడంతో ఇప్పటికే మూడు ఎకరాల్లో పంట ఎండిపోవ డంతో పశువుల మేతకు వదిలిపెట్టాను. ప్రభుత్వం ముందుచూపు చర్యలు చేపట్టకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఈ ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కేఎల్ఐ కాల్వ కింద వందల ఎకరాల్లో పంటలు ఎండుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.
కన్నీరు పెడుతున్న రైతన్నలు
మరికల్/ధన్వాడ, మార్చి 26 : చేతికి వచ్చిన పంటలను కాపాడుకోవడం కోసం రైతన్నలు చేయని ప్రయత్నాలు లేవు. పది రోజుల్లో పంటలు చేతికొస్తాయని ఎదురు చూస్తున్న రైతులకు కన్నీరే మిగులుతున్నది. తమ పంటలను కాపాడుకోవడం కోసం రైతులు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నా పంటలు కాపాడుకుంటామనే ఆశలు కలుగడం లేదు. ఈ క్రమంలో మరికల్ మండలంలో రైతు రాములు నూతనంగా బోరు వేస్తే ఇంచున్నర నీరు వచ్చాయని, ఈ నీటితో పంటను ఎలా కాపాడుకోవాలని కన్నీరు పెడుతున్నారు. ధన్వాడ మండలంలోని మంత్రోనిపల్లికి చెందిన రైతు మహేందర్ వరి పంటను ఎలాగైన కాపాడుకోవాలని రెండు బోర్లు వేయించినా చుక్కనీరు రాకపోవడంతో చేతికొచ్చిన పంటలను పశువుల మేత కోసం వదిలిపెట్టాడు.
ప్రభుత్వం ఆదుకోవాలి..
నేడు మూడు ఎకరాల్లో వరి పంటను సాగు చేశాను. ప్రభుత్వం నుంచి నాకు రైతు భరోసా డబ్బులు కూడా రాలేదని, చేతికొచ్చిన పంట చేజారి పోయి ందని, పంటను కాపాడు కోవడం కోసం చివరి వరకు పోరాడినా గెలువలేకపోయాను. పంట పెట్టుబడికి, కొత్తగా బోర్లు వేయడానికి రూ.లక్ష 70 వేలు అప్పు చేశాను. ఆ అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఎండిన పంటలను గుర్తించి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి.
– మహేదంర్, రైతు, మంత్రోనిపల్లి, ధన్వాడ మండలం, నారాయణపేట జిల్లా.