యాసంగి పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. చాలా చోట్ల చెరువులు, ప్రాజెక్టులు అడుగంటగా.. భూగర్భ జలాలు తగ్గి బోర్లు వట్టిబోగా.. వరితోపాటు ఇతర పంటలు ఎండిపోతున్నాయి. వనపర్తి జిల్లాలో లక్షా 80వేల ఎకరాల్లో వరి సాగైంది. జూరాల, భీమా కాల్వల కింద నీటి సమస్య తక్కువగా ఉన్నా.. బోరుబావుల కింద నమ్ముకొని పంటలు సాగు చేస్తే రైతులను నష్టాల పాలు చేశాయి. చేతికందే దశలో పంటలు ఎండిపో తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా పంటలను కాపాడుకోవాలన్న తాపత్రాయంతో రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి పొలాలను తడుపు తున్నారు. అయినా సరిపోక పంటలు ఎండుతుండడంతో చేసేది లేక పశువుల మేతకు వదిలేస్తున్నారు.
వనపర్తి మండలంలో కందిరీగ తండా గ్రామ పంచాయతీ పరిధిలో గిరిజనులు యాసంగిలో పంటలను సాగు చే శారు. ప్రధానంగా వరి పంటకు ప్రాధాన్యతనిచ్చారు. వానకాలంలో అధికంగా వర్షా లు రావడం.. అలాగే గత నెల వరకు చెరువులు, కుంటల్లో నీరుండటం వల్ల బోరు, బావులు కూడా ఓ మోస్తరుగా పనిచేశాయి. ప్రస్తుతం ఆ తండాలో వరి చేలన్నీ ఎండిపోతున్నాయి. చాలా వరకు బోర్లపై ఆధారపడి సేద్యం చేస్తున్నారు. తండా సమీపంలోనే మశ మ్మ చెరువు ఉన్నది. ఆ చెరువులో నీళ్లున్నంత వరకు ఈ గిరిజన రైతులకు నీటి సమస్య రాలేదు. ఇక ఆ చెరువులో నీళ్లన్నీ ఇటీవల పక్షం రోజుల కిందట పూర్తిగా అయిపోయి.. చెరువు ఎండినంత పని జరిగింది. దీంతో గిరిజన రైతులకు కష్టాలు మొదలయ్యాయి.
కందిరీగతండాలో కొందరు రైతులు ట్యా ంకర్లను పెట్టి వరి చేలకు నీళ్లు కొట్టినా ఫలి తం దక్కడం లేదు. చేతికి వచ్చిన చేలు కండ్ల ముందు ఎండిపోతుంటే.. చూడలేక రైతులు ట్యాం కర్ నీటితోనైనా బతికించుకుందామని ఆరాట పడుతున్నారు. అయినా ఆ ట్యాంకరు నీరు ఏ మూలకు సరిపోవడం లేదు. మడిలో వదిలిన నీరు ముందుకు పోవడం లేదు. దీంతో ఈ ప్రయత్నాలు కూడా రైతులకు సఫలం కానందున దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రోజు పది ట్యాంకర్లు మడిలో పోసినా ఒక్క మడి కూడా తడవడం లేదని గిరిజన రైతులు లబోదిబో మంటున్నారు.
కందిరీగ తండాలో ఒకే ప్రాంతంలో పది ఎకరాల వరకు యాసంగి వరి చేతికి వచ్చే దశలో బోర్లు నీళ్లు పోయక రైతుల నుంచి చేజారి పోతుంది. ఈ పరిస్థితిలో చేలను చూసిన వా రెవరికైనా మనస్సు తరుక్కుపోతుంది. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి కండ్ల ముందు ఎండిపోతున్నా పంటలను చూస్తుంటే.. ఏమీ చేయలేని నిస్సాహాయతలో కొట్టుమిట్టాడుతున్నారు. తండాకు చెందిన మోతీలాల్ పొలం 2 ఎకరాలు, దేవీసింగ్ 2 ఎకరాలు, శంకర్ 2 ఎకరాలు, దేవ్లా ఎకరన్నర, మంగ్లీ ఎకరా, కోటయ్యలకు చెందిన ఎకరన్నర వరి పొలం నీళ్లు లేక ఎండిపోయింది. ఎండిన పొలాలు ఒకవైపు.. ట్యాంకరుతో నీళ్లు పడుతుండడం మరోవైపు.. పశువులకు మేతగా వరిని కోస్తున్న దృ శ్యాలు ఇంకోవైపు చూస్తుంటే రైతుల గుండెలు తట్టుకోలేకపోతున్నాయి.
వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి చివరి దశలో తీవ్రంగా నష్టపోతున్న తమను ప్రభు త్వం ఆదుకోవాలని కందిరీగతండా గిరిజనులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మూడు నెలలకు పైగా వరి చేలను కాపాడుకుంటే.. ఇలా తమ కండ్లముందు ఎండుతున్న చేలను చూసి జీర్ణించుకోలేక పోతున్నామని ఆవేదన చెందుతున్నా రు. ఎకరాకు పెట్టుబడి రూ.30 వేలకు పైబడి ఖర్చువుతుందని, మళ్లీ మా మూడు నెలల కష్టం కూడా ఇందులోనే ఉం టుందని, ఇలా మమ్మల్నీ నట్టేట ముంచినట్లు జరిగితే ఎలా బతకాలని గిరిజనులు బావురుమంటున్నారు. ఆశపడి పంట పండుతుంది అనుకున్నాం.. కానీ.. చివరకు ఇలా అయిదనుకుంటే సేద్యం చేసేవాళ్లమే కాదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
భూమిని నమ్మి సే ద్యం చేసుకున్నం. వానకాలంలో వాన లు బాగా వచ్చిన యి. మా దగ్గరున్న చెరువు నిండుగా ఉండింది. అప్పుడు మాబోర్లు కూడా నీళ్లు బాగానే పోసినయి. కానీ,ఉన్నట్లుండీ చేలు చేతికి వచ్చినప్పుడు చుక్క నీరు కొట్టకుండా బోర్లు ఎండిపోయినవి. ఈ పరిస్థితిలో మమల్ని సర్కారు ఆదుకోవాలి. గతంలో నాకు ఎప్పుడు ఇలా జరగ లేదు. రెండుసార్లు బోరు కాలిపోతే చేయించుకు న్నా.. అన్ని కలిపి మమ్మల్ని మరింత అప్పులోకి నెట్టిశాయి.
– మోతీలాల్, గిరిజన రైతు, కందిరీగతండా, వనపర్తి మండలం