గట్టు : రైతులు ఒకరికి చేయి చాచే విధంగా కాకుండా చేతితో ఒకరికి ఇచ్చే విధంగా రైతులు, రైతు కూలీలు ఆర్థికంగా ఎదగాలని ఇన్చార్జి అదనపు కలెక్టర్ నరసింగరావు ( Additional Collector Narsingha Rao ) ఆకాంక్షించారు. మండలంలోని ఆరగిద్ద శివారులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను గురువారం పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ఉపాధి హామీ పనులను మొక్కుబడిగా కాకుండా నిర్ణీత కొలతల్లో చేస్తే ఆశించిన స్థాయిలో కూలీ డబ్బులు అందుతాయని స్పష్టం చేశారు.
మూస పంటలకు స్వస్తి చెప్పి వాణిజ్య పంటల సాగుపై ( Commercial Crops ) దృష్టి పెట్టాలన్నారు. తద్వారా పెట్టుబడితో పాటు కాయకష్టం తగ్గి, రైతులు లాభాల బాటలో పయనించవచ్చని సూచించారు. ఉపాధి హామీ పథకంలో రకరకాల పనులు ఉన్నాయని, అవసరమయ్యే వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు . అదనపు కలెక్టర్ మోటార్ సైకిల్‌పై పంట పొలాలలో కలియ తిరుగుతూ ఉపాధి హామీ పనులను పరిశీలించారు. మండల మహిళా సమాఖ్య కార్యలంలో ఉపాధి హామీ సిబ్బందితో సమావేశమై మాట్లాడారు.
ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీల సంఖ్యను మరింత పెంచాలని కోరారు. కూలి డబ్బులు నిర్ణీత సమయంలో అందే విధంగా చూడాలన్నారు. ఉపాధి సిబ్బంది పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో పారిశుధ్యం పై శ్రద్ధ వహించాలని పంచాయతీ కార్యదర్శులకు స్పష్టం చేశారు. ఆరగిద్దలో ఇందిరమ్మ ఇండ్ల ప్రగతిని హౌసింగ్ పీడీ కాశీనాథ్‌తో కలిసి పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చెన్నయ్య, ఏపీవో స్వామి, టెక్నికల్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.