ప్రభుత్వం రైతన్నలకు భరోసా కల్పిస్తున్నది. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు అన్నదాతలకు వరాలుగా మారాయి. రైతుబంధుతో పెట్టుబడి కష్టాలు దూరమయ్యాయి. పంట ఖర్చు కోసం ఎవరి వద్ద చేయి చాపాల్సిన అవసరం లేకుండా.. దళారులు బెడద లేకుండా నేరుగా రైతన్నల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. ఏదైనా కారణంచేత మరణిస్తే ‘రైతుబీమా’ కింద రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందజేయడంతో బాధిత కుటుంబానికి భరోసా ఏర్పడుతున్నది. నిరంతరం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుండడంతో ఇష్టం వచ్చినప్పుడు వెళ్లి పొలాలకు నీళ్లు పారించుకునే వెసులుబాటు కలిగింది. దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకూ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నది. సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లను అందజేస్తున్నది. ఐదు వేల ఎకరాలకో రైతువేదిక నిర్మించడంతోపాటు సాగుపై అవగాహన కల్పించి మెళకువలు నేర్పిస్తున్నది. స్వయాన రైతు బిడ్డ అయిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడంతోనే ఇదంతా సాధ్యమైందని, కష్టాల కడలి నుంచి విముక్తి కల్పించడంతో నేడు సంబురంగా సాగుచేసుకుంటున్నామని కర్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గద్వాల, ఆగస్టు 10 : పదిమందికి పట్టెడన్నం పెట్టే రైతన్నను కాపాడుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చిన ఐదేండ్లల్లో రైతుల కోసం తీసుకున్న నిర్ణయాలతో అన్నదాతల్లో ఆత్మైస్థెర్యం పెరిగింది. సాగు దండుగ అనుకుంటున్న సమయంలో ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. గత పాలకులు రైతులను ఏనాడూ పట్టించుకోలేదు. వారి కష్టాలు కండ్లారా చూసిన రైతుబిడ్డ, ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అండగా నిలుస్తున్నారు. ఏ సహాయమైనా నేరుగా రైతులకు చేరేలా చర్యలు తీసుకుంటూ వ్యవసాయాన్ని పండుగలా మార్చుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రైతులకు 9 నుంచి 24 గంటల ఉచిత విద్యుత్, ఉచిత విద్యుత్ కనెక్షన్లు, రుణమాఫీ, రైతుబంధు, రైతు బీమా పథకాలతో జోగుళాంబ గద్వాల జిల్లాలో సుమారు1,73,826 మంది కి మేలు చేకూరింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల వివిధ రూపాల్లో గద్వాల జిల్లాలో రైతులు పొందిన లబ్ధి వివరాలు.. పరిశీలిస్తే…
రుణమాఫీతో 95,199మందికి లబ్ధి..
ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నాలుగు విడుతల్లో రైతులకు రుణమాఫీ చేసింది. దీంతో గద్వాల జిల్లాలో సుమారు 95,199మందికి లబ్ధి చేకూరింది. కాగా నాలుగు విడుతల్లో ప్రభుత్వం రూ.367కోట్లు విడుదల చేసి రుణాలన్నీ మాఫీ చేసింది.
ఉచిత విద్యుత్ కనెక్షన్లు..
ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగు విస్తీర్ణం పెరగడంతో విద్యుత్ మోటర్ల వినియోగం కూడా పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నా వారిని పట్టించుకోలేదు. కానీ స్వరాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రైతులందరికీ ఉచితంగా విద్యుత్ కనెక్షన్లను ప్రభుత్వం ఇచ్చింది. ఇందుకోసం సుమారు రూ.100కోట్లు ఖర్చు చేసింది. అన్ని రంగాలకు 24 గంటల పాటు, సాగుకు ఉచితంగా నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. పవర్హాలిడేలకు శాశ్వత ముగింపు నిచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్ర సృష్టించారు. ఈక్రమంలోనే 33/11(26)కేవీ సబ్స్టేషన్లు, 52 పవర్ ట్రాన్స్ఫార్మర్లు, తొమ్మిది 33కేవీ ఫీడర్లు, 11కేవీ(95) ఫీడర్లు, 16,874 వ్యవసాయ సర్వీస్ కనెక్షన్లు ఇచ్చి రైతులకు చేయూతనిచ్చింది. దీంతో పగటి పూట మాత్రమే పొలానికి నీరు పారింకునే అవకాశం లభించింది.
ఐదువేల ఎకరాలకో ఏఈవో..
గతంలో గద్వాల, అలంపూర్ నియోజవర్గాలకు కలిపి మొత్తం 9మంది వ్యవసాయ అధికారులు ఉండేవారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు సాగుపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఐదువేల ఎకరాలకు ఒక ఏఈవో(వ్యవసాయ విస్తరణ అధికారి)ను నియమించింది. ప్రసుత్తం జిల్లాలో 84మంది ఏఈవోలు రైతులకు సాగులో మెళకువలు నేర్పుతున్నారు. భూముల సారాన్ని పరీక్షించడానికి జిల్లాలో 53మినీ పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
రైతుబంధుతో..
పంట పెట్టుబడికి తులు అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే 2018 మే 10న రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. వానకాలం, యాసంగిలో సాగుకు ఎకరాకు రూ.5వేల చొప్పున రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తుండడంతో అన్నదాత మోములో ఆనందం విల్లివిరుస్తున్నది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,60,799మంది రైతులకు రూ.2,156,61లక్షలు జమ చేసింది.
రైతుబీమా..
గతంలో రైతు మరణిస్తే ఆ కుటుంబ ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందులు పడేది. అటువంటి పరిస్థితికి స్వస్తి చెబుతూ సెంటు భూమి ఉన్న 18-59ఏండ్లలోపు రైతులకు రైతుబీమా సౌకర్యం కల్పించింది. ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 2,572మంది రైతుల నామినీల ఖాతాల్లో రూ.5లక్షల చొప్పున రూ.128.60కోట్లు ప్రభుత్వం జమ చేసింది.
రైతు వేదికలు..
జిల్లాలో ఐదువేల ఎకరాలకో ఏఈవో ఉండగా, క్లస్టర్ ప్రకారం 97 క్లస్టర్లకు 97 రైతువేదికలను ప్రభుత్వం నిర్మించింది. ఒక్కో భవనానికి రూ.22లక్షలు ఖర్చు చేస్తూ మొత్తం రూ.23.34కోట్లతో రైతువేదికలను ఏరాటు చేశారు. ఈ భవనాల్లో రైతులకు వివిధ పంటల సాగుపై ఏఈవోలు శిక్షణ ఇస్తూ పంటల సాగుపై మెళకువలు నేర్పుతున్నారు.
వ్యవసాయ యాంత్రీకరణ..
వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ఇప్పటివరకు 231మంది రైతులకు సబ్సిడీ కింద రూ.7.33కోట్ల విలువైన 231 ట్రాక్టర్లు పంపిణీ చేశారు. 14,397మంది రైతులకు రూ.5.46కోట్ల విలువ చేసే వ్యవసాయ పనిముట్లను ప్రభుత్వం అందించింది. రైతుల కోసం నిరంతరం శ్రమిస్తూ రైతు శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్కు రైతులు అండగా నిలుస్తున్నారు.