ఊట్కూర్ : వ్యవసాయ పొలాలకు రోడ్డు సౌకర్యం ( Road ) లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని పలువురు రైతులు సోమవారం ఎంపీడీవో ధనుంజయ గౌడ్ ( MPDO Dhanujay) తో మొరపెట్టుకున్నారు. ఊట్కూర్ మండలంలోని పెద్దపొర్ల గ్రామం నుంచి గాడిదల వాగు మీదుగా మండల కేంద్రానికి వెళ్లే రహదారి మరమ్మతుకు నోచుకోక పోవడంతో వ్యవసాయ పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులకు గురవుతున్నామని వినతిపత్రాన్ని (Farmers Representation ) అందజేశారు.
రైతులు శంకర్, భీమేష్, లింగప్ప మాట్లాడుతూ గ్రామం నుంచి మండల కేంద్రానికి వెళ్లే మధ్య బాట పూర్తిగా ధ్వంసం కావడంతో వర్షాకాలం వస్తే బురదమయం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలకు వెళ్లేందుకు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉంటుందన్నారు. వ్యవసాయ పనుల కోసం ఎడ్ల బండ్లు సైతం వెళ్లలేకపోతున్నాయని వివరించారు.
రోడ్డు మరమ్మతు చేపట్టాలని అధికారులకు విన్నవించినా తమ సమస్యను పరిష్కరించలేదని ఎంపీడీవోకు మరోసారి వెల్లడించారు. రహదారి పూర్తయితే 200 ఎకరాలకు రవాణా సౌకర్యం ఏర్పడి రైతులు, వ్యవసాయ కూలీలకు ఇబ్బందులు తొలగిపోతాయని అన్నారు. ఇప్పటికైనా స్పందించి రహదారి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యాగ్నేశ్వర్ రెడ్డి, ఉపాధి ఏపీవో లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.