నారాయణపేట, జూన్ 20 : బీఆర్ఎస్ హయాంలో రైతులు నెంబర్ స్థానంలో నిలవగా కాంగ్రెస్ పాలనలో దుర్భర స్థితికి చేరుకున్నారని మాజీ ఎమ్మెల్యే, పేట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి విమర్శించారు. శనివారం పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రైతులను అధః పాతాలానికి పడిపోయారన్నారు. రైతులు పండించిన ధాన్యం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు.
బీఆర్ఎస్ పాలనలో 45వేల చెరువులకు పూడికతీత పనులు చేపట్టారని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని గుర్తుచేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తి చేశామన్నారు. బీఆర్ఎస్ పాలనలో 11సార్లు మొత్తం రూ.72వేల కోట్లను రైతుబంధు ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేశామని, అలాగే రూ.29వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎరువులు, యూరియా ధరలు పెరిగాయని, అవి కూడా సకాలంలో అందడం లేదన్నారు. యాప్ ద్వారా అందించడం వల్ల నిరక్ష రాస్యులైన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.
పీసీసీ హోదాలో ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన రేవంత్‌రెడ్డి ప్రస్తుతం ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. నోరు ఎత్తితే అప్పు అని చెప్పుకొనే రేవంత్‌రెడ్డి గడిచిన రెండున్నరేండ్లలో రెండున్నర లక్షల అప్పు చేసి ఏం చేశారని అన్నారు. పేట నియోజకవర్గంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, సమస్యల మీద ప్రశ్నిస్తే కేసులు వేసి బెదిరిస్తున్నారన్నారు. ఎన్నికల ముందు అన్ని పంటలను కొనుగోలు చేస్తామని చెప్పి నేడు పంటల కొనుగోలుకు ముందుకు రావడం లేదన్నారు.
కేంద్రమే పంటలను కొనుగోలు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం కేబీనెట్లో తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని లేకపోతే బీఆర్ఎస్ తరపున ఆందోళన చేస్తామన్నారు. ఈనెల 30న వేసే రైతుభరోసా డబ్బులు ఈ ఏడాది వానకాలం పంట డబ్బులా లేక గత యాసంగి డబ్బులా అన్న విషయాన్ని రైతులకు తెలపాలన్నారు. రైతు వ్యతిరేక విధానాలను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. జిల్లా దవాఖానలో నీళ్లు రావడం లేదని, పాలిటెక్నిక్ కళాశాల తిరిగి వెళ్లిపోయిందన్నారు. ఎస్పీ ఆఫీస్ ఇప్పటి వరకు కట్టడం లేదన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు భరత్, నారాయణమ్మ, నాయకులు విజయ్‌సాగర్, వెంకట్‌రెడ్డి, సుభాష్, తిరుపతయ్య, శ్రీనివాస్‌రెడ్డి, గుర్నాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.