మాగనూరు, నవంబర్ 3 : కొనుగోలు కేంద్రాల్లో రైతు లు ధాన్యం విక్రయించి దళారులను నమ్మొద్దని ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్నా.. ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. వరి కోతలు ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా ఇప్పటికీ గన్నీ బ్యాగులు కూడా లేవని మాగనూర్, కృష్ణ ఉమ్మడి మండలాల రైతులు వాపోతున్నారు.
మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గత నెల 16న వివిధ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఉమ్మడి మండల వ్యాప్తంగా 10 లక్షల గన్నీ బ్యాగులు చేరాల్సి ఉండగా, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 17 రోజులైనా ఒక కేంద్రానికి కూడా బ్యాగులు ఇవ్వకపోవడంతో రైతులు అయోమయంలో పడిపోయారు. రెండు మండలాల్లో 30వేల ఎకరాల వరకు సన్న రకం ధాన్యాన్ని పండించారు. అయితే వరి చేతికొచ్చి కోతలు ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా గన్నీ బ్యాగుల కొరత వేధిస్తున్నది.
కొల్పూరులో వడ్లను రాశులుగా పోశామని, గన్నీ బ్యాగులు వెంటనే ఇవ్వాలని నిరసన తెలిపారు. కొంత మంది రైతులు చేసేది లేక దళారులను నమ్మి పక రాష్ట్రమైన కర్ణాటకకు 75 కేజీల బస్తా చొప్పున రూ.1,650కు అమ్మడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం రూ.2,320 మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నది. కేసీఆర్ సర్కారులో పంట కోతకు రాగానే పొలాల వద్దకు వెళ్లి కొనుగోలు చేసేవారని రైతులు గుర్తుచేస్తున్నా రు. ధాన్యాన్ని పక్క రాష్ర్టానికి తరలిస్తున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
రైతులకు పంపిణీ చేసేందుకు గన్నీ బ్యాగులు 21లక్షలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా కొన్ని రావాల్సి ఉన్నది. గన్నీ బ్యాగులు కావాలని అడిగితే ఇస్తామని సీవో గోవర్ధన్‌రెడ్డి, సివిల్ సప్లయ్ డీఎం దేవదాసు తెలిపారు.