చిన్నంబావి మండలం వెలగొండ గ్రామానికి చెంది న నారెడ్డి చంద్రారెడ్డి.. తన భార్య వినోద పేరిట వీపనగండ్ల ఐవోబీలో రూ.99,913 రుణం తీ సుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రు ణమాఫీ జాబితాలోనూ ఆమె పేరు వచ్చింది. అయితే, వారి ఖాతాలో డబ్బులు మాత్రం జమకాలేదు. బ్యాంక్ మేనేజర్‌ను సంప్రదిస్తే అకౌంట్ వివరాలను ప్రింట్ తీసి చేతిలో పెట్టి.. ఇక వెళ్లండి అంటూ సెలవిచ్చాడు. ఆ వివరాలతో జిల్లా వ్యవసాయ కార్యాలయానికి చేరుకొని టెక్నికల్ ఏడీఏను కలిసి తన సమస్యను మొరపెట్టుకున్నాడు. ఇప్పటికే ఐదు దఫాలు బ్యాంకు, ఏఈవోల వద్దకు తిరిగానని, ఎక్కడికి వెళ్లినా న్యాయం జరగడం లేదని బోరుమన్నాడు.
వనపర్తి, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీపై రణం మొదలైంది. అర్హత ఉన్నా లబ్ధి చేకూరకపోవడంతో ఆందోళనలకు దారితీస్తున్నది. చెప్పిన ప్రాతిపదిక ఒకటి.. అమలుచేస్తున్నది మరొకటి అన్నట్లుగా సర్కారు తీరు కనిపిస్తున్నది. వనపర్తి జిల్లాలో రుణమాఫీపై రైతులు గుర్రుగా ఉన్నారు. తొలివిడుతలో 27,066 మందికి రూ.145.55 కోట్లు, రెండో విడుతలో 16,527 మందికి రూ.154.58 కోట్లు, మూడో విడుతలో 10,047 మందికి రూ.126.62 కోట్లు మాఫీ అయ్యింది. ఈ క్రమంలో మూడు విడుతల్లో కలిపి 53,640 మంది రైతులకు రూ.426.76 కోట్ల రుణం మాఫీ జరిగిందని ప్రభుత్వం చెబుతున్నది.
అయితే, రుణమాఫీ లో అనేక పొరపాట్లు ఉండటం.. ఇప్పటివరకు చాలా మంది ఖా తాల్లో డబ్బులు జమ కాకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రూ.లక్షలోపు రుణమాఫీ ప్రకటన వెలువడిన వెం టనే జాబితాలో పేరురాని వారంతా బ్యాంకులకు పరుగులు తీశారు. ఇది గమనించిన సర్కార్ వ్యవసాయ శాఖ పరిధిలో ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. అర్హత ఉన్నా రుణమాఫీ కాని వారు దరఖాస్తు చేసుకోవాలని కాం గ్రెస్ పెద్దలు చెప్పడంతో రైతులు అధికారుల వద్దకు వెళ్తున్నా రు. అయితే, ఏఈవోల వద్దకు వెళ్లిన వారు కొద్ది మందే ఉ న్నారు. మాఫీ కాని చాలా మంది రైతులు ముందుకు రావడంలేదు.
మాఫీ కాలేదని దరఖాస్తు చేసుకున్నారు. కొత్తకోట మండలంలో అత్యధికంగా 2,294 మంది వినతులిచ్చారు. ఇదిలా ఉండగా, మూడో విడుతలో రూ.2 లక్షలలోపు రుణం మాఫీ కాలేదంటూ రైతులు అధికారులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. రైతువేదికలు, బ్యాంకుల ఎదుట ఆందోళనలకు దిగుతున్నారు. జిల్లాలో దాదాపు మరో 50 వేల మంది రైతులకు మాఫీ రావాల్సి ఉంటుందని అనధికార అంచనా. అయితే, చిన్నచిన్న సమస్యలను యాప్‌ల ద్వారా చూసి రైతులకు ఏఈవోలు భరోసా ఇచ్చే ప్రయత్నంచేశారు. కానీ, ఏఈవోలు కూడా రైతుల సందేహాలకు సమాధానాలివ్వలేక అలసిపోతున్నారు. శాఖాపరమైన పనుల ఒత్తిడి ఉండగా.. అదనంగా ఈ పని తలనొప్పిగా ఉందన్న అభిప్రాయం అధికారుల నుంచి వ్యక్తమవుతున్న ది. కొందరైతే ఫోన్లు కూడా ఎత్తడం లేదని రైతులు వాపోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన రూ.రెండు లక్షల రుణమాఫీకి అనేక తిరకాసులు పెట్టింది. తీసుకున్న రూ.లక్షాయాభై వేల రుణానికి మాఫీ వస్తుందా.. లేదా అని అయోమయంగా ఉన్నది. మాకున్న తెల్లరేషన్‌కార్డులో నలుగురు కుటుంబ సభ్యులకు ఒక్కరికీ రుణమాఫీ వర్తించలేదు. మొత్తం పదెకరాలకు 2018లో యూనియన్ బ్యాంకులో రూ.లక్షాయాభైవేల క్రాప్‌లోను తీసుకొని ఏటా రెన్యువల్ చేస్తూ వచ్చిన.. రెండో విడుత రుణమాఫీ లిస్టులో మాపేరు వస్తుందని ఆశించినా రాలేదు. నా భార్య పేరు మీద తీసుకున్న రూ.2లక్షల రుణం కూడా మాఫీకాలేదు.
– వాసరెడ్డి, నాగల్‌కడ్మూర్, అమరచింత
రుణమాఫీ కోసం ఏడునెలల నుంచి ఎదురుచూస్తున్నా నేటికీ వర్తించలేదు. యూనియన్ బ్యాంకులో రూ.లక్షాయాభై వేల క్రాప్‌లోన్ తీసుకొని గతేడాది ఆగస్టులో రెన్యువల్ చేశాం. ఇంతవరకు ప్రకటించిన మూడు విడుత లిస్టులో నాదిగానీ.. నా కుటుంబ సభ్యుల పేరు రాలేదు. వ్యవసాయశాఖ, బ్యాంక్ అధికారులను సంప్రదిస్తే రే షన్‌కార్డు లింక్‌తో నలుగురు కుటుంబ సభ్యులు ఉండడంతో సమస్య ఉందని సమాధానం చెబుతున్నారు. నలుగురిలో ఒకరికైనా మాఫీ రావాలి కదా.., మా కాలనీలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ వచ్చింది, కానీ మాకు రాలేదు. ఇకముందైనా వస్తాదా, లేదా అనుమానంగా ఉంది.
– భౌరిశెట్టి నాగిశెట్టి, అమరచింత
మాది సాధారణ రైతు కుటుంబం. నాకు ఎకరా పొలం ఉంది. మూడేండ్ల కిందట కొత్తకోట ఎస్బీఐలో రూ.40 వేలు పంట రుణం తీసుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పినట్లు నా రుణం మాఫీ అయితదని సంతోషపడ్డ. ఎందుకు కాలేదో అర్థం కావడంలేదు. బ్యాంకు లో అడిగితే నీపేరు లీస్టులో రాలేదంటున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి వెళ్తే బ్యాంక్ స్టేట్మెంట్, పట్టాదారు పాసుబుక్కు, ఆధార్‌కా ర్డు తీసుకురమ్మన్నారు. అన్ని పత్రాలు ఇచ్చినా ఫ లితం లేదు. ఎప్పుడు అయితదని అడిగితే సరైన సమాధానం ఇస్తలేరు. అయ్యా సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా చిన్నసన్నకారు రైతులకు అండగా ని లిచి రుణాలు మాఫీ చెయ్యండి.
– కృష్ణయ్య, శంకరమ్మపేట, మదనాపురం మండలం
కాంగ్రెస్ సర్కారు రై తుల రుణమాఫీని మూ డు విడుతల్లో చేస్తామని చెప్పింది. క్రాప్‌లోన్ రూ.62వేలు ఉంది. కాంగ్రెస్ ఫ్రభుత్వం అమలు చేసిన పంట రుణమాఫీ మొదటి విడుత నుంచి ఎదురుచూస్తున్నా.. మూడు విడతలై నా మాఫీ కాలేదు. బ్యాంకు చుట్టూ తిరిగి న ప్రయోజనం లేకుండా పోయింది. బ్యాంక్, వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యంతో నాకు రుణమాఫీ కాలేదు. నాతోపాటు నాలాంటి ఎంతోమంది పేద రై తులు ఇలానే ఇబ్బందులు పడుతున్నా రు. రుణమాఫీపై ఆశలు పోయాయి.
– తెలుగు నర్సింహ, రైతు, బెక్కెం, చిన్నంబావి మండలం
నా పేరు మీద మూడెకరాల పొలం ఉన్నది. వనపర్తి యూనియన్ బ్యాంకులో రూ.1.20 లక్షల పంటరుణం తీసుకున్నం. నా భర్త రూప్లానాయక్ పేరు మీద ఉన్న భూమిపై కూడా రూ.1.20 లక్షల రుణం ఉన్నది. అయితే, కాంగ్రెస్ ప్రకటించిన రుణమాఫీ కింద మా ఇద్దరిలో ఒక్కరికి కూడా లబ్ధి చేకూరలేదు. కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నాం. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక్కడికి పోతే అక్కడికి.. అక్కడికి పోతే ఇక్కడికి అంటూ కాలయాపన చేస్తున్నారు. ఏఈవోలు ఫోన్ ఎత్తడం లేదు. లాభం లేదనుకొని చివరకు కలెక్టరేట్‌కు వచ్చిన. కాంగ్రెసోళ్ల ప్రచారం చూస్తే పెద్దగా ఉంది.. కింది స్థాయిలో చూస్తే ఏమీ లేదు. గిరిజన రైతులమైన మాకే మాఫీ కాకుంటే ఎలా. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మాకు న్యాయం జరిగేలా చూడండి.
– ఇస్లావత్ భాగ్యలక్ష్మి, పెద్దగూడెం తండా, వనపర్తి మండలం
రూ.2లక్షల వరకు ఏకకాలంలో రూణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది. నాకు ఎకరా 32 గుంటల పొలం ఉన్నది. కొత్తకో ట ఎస్బీఐలో రూ.లక్షా20వేలు అప్పు తీసుకు న్న. రెండో విడుతలో రూ.1.50 లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రకటించినా నేను లబ్ధి పొందలే దు. రేవంత్‌రెడ్డి మాటలు నమ్మి ఓట్లేస్తే మంచి గు ణపాఠం చెప్పిండు. రైతులను మోసం చేస్తే కాం గ్రెస్‌కు పుట్టగతులుండవు. రైతుల శాపనార్థాలు ప్రభుత్వానికి తగులుతాయి. ఎందుకు గొప్పలు చెప్పుకోవాలి. తూతూమంత్రంగా చేసి చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి అందరికీ రుణమాఫీ చేయాలి.
– మూలమల్ల యాదగిరిరెడ్డి, దంతనూరు, మదనాపురం మండలం