మల్దకల్, మే 29 : ‘తడిసిన ధాన్యం’ అన్న శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో బుధవారం కథనం ప్రచురితమైంది. కాగా గురువారం డీసీవో శ్రీనివాస్, సివిల్ స ప్లయ్ డీఎస్వో స్వామి, మండల వ్యవసాయధికారి రాజశేఖర్ మల్దకల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ధాన్యం వెంటనే తరలించేలా చర్యలు తీ సుకోవాలని సెంటర్ ఇన్చార్జిని ఆదేశించారు.
తర్వాత జిల్లా అధికారులకు ఇచ్చిన నివేదికలో ‘నమస్తే తెలంగాణ’లో తప్పుడు వార్త ప్రచురితమైందని నివేదికను పంపారు. ఈ నివేదికను చదివిన స్థానిక ‘నమస్తే’ రిపోర్టర్ గురువారం సాయంత్రం మళ్లా కొనుగోలు కేంద్రానికి వెళ్లాడు. అక్కడి రైతులతో మాట్లాడి వారి కష్టాలను వినడంతోపాటు మొలకెత్తిన విత్తనాల ఫొటోలు తీశారు. రైతుల అభిప్రాయాలు సేకరించారు.
15 రోజుల కిందట ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి 20 క్వింటాళ్ల ధాన్యం అమ్మడానికి తెచ్చాను. నాలుగు రోజుల కిందటి నుంచి ముసురు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సెంటర్లో ఉన్న ధాన్యం తడిచి అందులోని 2 క్వింటాళ్లు మొలకెత్తింది. దీంతో చేసేది లేక పక్కకు సంచుల్లో నింపి ఉంచాం. ఇది తనకు నష్టమే అన్నారు.
– ఉప్పరి తిమ్మప్ప, రైతు, మల్దకల్
ఈనెల ఒకటో తేదీన కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చాను. కొనుగోలు చేయకపోవడంతో పడిగాపులు కాశాం.. ఇటీవల కురిసిన ముసురు వర్షాలకు 3 క్వింటాళ్ల వరకు ధాన్యం తడిచిపోయింది. మొలకలు కూడా రావడంతో ఆందోళన చెందాను. ఈ నష్టం ఎవరు భరిస్తారు..
– ఉప్పరి రామకృష్ణ, రైతు, మల్దకల్