కల్వకుర్తి/వంగూరు, ఆగస్టు 16 : సీఎం రేవంత్‌రెడ్డి సొంత మండలంలో కరెంట్ కష్టాలకు తెరలేచింది. సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లికి కూతవేటు దూరంలో ఉన్న పొల్కంపల్లి గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రం వద్ద రైతులు నిరసనకు దిగారు. వ్యవసాయానికి 24గంటల కరెంట్ ఇస్తున్నామని వేదికలపై ఉదరగొడుతున్న కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోని ఎండిపొతున్న పంటలను చూడాలని రైతులు డిమాండ్ చేశారు. 24గంటలు దేవుడెరుగు 10 నుంచి12గంటలు కూడా వ్యవసాయానికి కరెంట్ రావడం లేదని మండిపడ్డారు. ఇందులో మూడు, నాలుగు గంటల పాటు కరెంట్ ట్రిప్ అవుతుంది. సగం సగం కరెంట్‌తో వ్యవసాయం ఎలా చేయాలి. వ్యవసాయం చేసేకన్న హోటళ్లలో చిప్పలు కడిగితే మేలు అని రైతులు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు.
వ్యవసాయానికి 24గంటల విద్యుత్ సరఫరా చేయాలనే డిమాండ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సొంత మండలమైన వంగూరులోని పొల్కంపల్లి గ్రామ రైతులు తమ గ్రామంలోని విద్యుత్ ఉప కేంద్రం వద్ద నిరసనకు దిగారు. సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి కూతవేటు దూరంలో ఉన్న పొల్కంపల్లిలో రైతులు విద్యుత్ ఉప కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. రెండురోజుల కిందట కల్వకుర్తి మండలం మార్చాల గ్రామ విద్యుత్ ఉపకేంద్రం వద్ద వ్యవసాయానికి కరెంట్ కోసం రైతులు నిరసనకు దిగిన ఉదంతం మరువకముందే పొల్కంపల్లి వద్ద రైతులు నిరసనకు దిగారు. అయినా ఇప్పటి వరకు వ్యవసాయానికి ఇచ్చే కరెంట్‌పై స్పష్టత ఇవ్వలేదు.
కరెంట్ అంశం నుంచి తప్పించుకునే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులు అంటూ కాలం వెళ్లదీసే ప్రయత్నాలు చేస్తుందని రైతు సంఘం నాయకులు మండిపడుతున్నారు. వరి సాగు చేయవద్దు అంటూ వ్యవసాయాధికారులపై ఒత్తిడి తేవడం సిగ్గుచేటని వారు ఎద్దేవా చేస్తున్నారు. ఈ ఏడాది వర్షం కురవకపోతే ..ఈ ప్రభావం వచ్చే ఏడాది భూగర్భ జలాలపై పడుతుంది. అంతే కానీ ఈ ఏడాదే ఏదో అయిపోతుందనే భ్రమలను ప్రభుత్వం కల్పించడం సిగ్గుచేటని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ప్రస్తుతానికి భూగర్భ జలాలు బాగానే ఉన్నాయి. సక్రమంగా కరెంట్ ఇస్తే ఈ వానకాలం పంటలకు వచ్చిన ఇబ్బంది ఏమిలేదు. కరెంట్ ఇవ్వడం ఈ ప్రభుత్వానికి చెతకావడం లేదని అందుకే 10గంటలకు మించి కర్టెంట్ ఇవ్వడం లేదని, అందులో ట్రిప్ పేరుతో 2, 3 గంటల కోతలు విధిస్తున్నారని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
వ్యవసాయమే తమ బతుకని, వ్యవసాయానికి కరెంట్ ఇవ్వకుంటే తాము ఏమిచేసుకొని బతకాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ హయాంలో 24గంటల ఉచిత విద్యుత్ వ్యవసాయానికి ఇచ్చారని, మీరు కూడా 24గంటల కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారని, మరీ ఇప్పుడు ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోతున్నారని రైతు లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రైతు ప్రభుత్వమని వేదికలపైన చెప్పుకుంటారు. కరెంట్, ఎరువులు ఇవ్వ రు, పండిన గింజలు కొనరు, అడిగితే రైతులపై కేసులు పెడతారు.
మరీ మీది ఏవిధంగా రైతు ప్రభుత్వమని చెప్పుకుంటారని రైతులు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను నీలదిస్తున్నారు. అడుగడుగున రైతులను ఇబ్బందులు పెడుతున్నారని, తాము వ్యవసాయం చేయకుండా ఏం పని చేయాలని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తమకు మిగిలింది పట్టణాలకు వెళ్లి హోటళ్లలో చిప్పలు కడగటం లేదా ఉన్న ఊర్లోని ఉరేసుకొని చావడమే మాకు దిక్కు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ హయాంలో క్షణం కూడా పోకుండా వ్యవసాయానికి 24గంటల కరెంట్ ఇచ్చిందెట్లా..మరి మీకు ఇవ్వడానికి వచ్చిన కష్టమేమిటని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రైతులు ప్రశ్నిస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ రాష్ట్రంలో ఏవైన భీకర పరిస్థితులు వచ్చాయా..మరీ ఎందుకు వ్యవసాయానికి కరెంట్ ఇవ్వడం లేదు. కరెంట్ ఇస్తే రైతులు పంటలు సాగుచేస్తారు.పంటలు సాగుఅయితే దిగుబడి వచ్చిన ధాన్యాన్ని మద్దుతు ధరకు కొనుగోలు చేయాలి..ఇందంతా ఎందుకుని ప్రభుత్వం ముందుగానే కరెంట్‌కు ఎసరుపెట్టిందని రైతులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లికి చెందిన వారే మనుషులా.. రాష్ట్రంలోని మిగతా గ్రామాల్లో ఉండేవా రు మనుషుల కారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నా యి. సీఎంకు సొంత గ్రామంపైన కొంత ప్రేమ ఉండవచ్చు. మిగతా గ్రామాల కన్నా కొన్ని ఎక్కువ నిధులు ఇవ్వవచ్చు. ఇందులో ఎవరికీ అభ్యంతరం ఉండదు. అలాకాకుండా రాష్ట్రంలోని మిగతా గ్రామాలను విస్మరించి కేవలం కొండారెడ్డిపల్లికే అన్ని చేస్తే ఇది పూర్తిగా వివక్ష అవుతుందని ప్రజాస్వామిక వాదులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివక్ష ఎలా ఉందంటే.. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కొండారెడ్డిపల్లిలో ఆరేడు నెలల కిందట 100 మందికి ఆసరా పింఛన్లు ఇచ్చారు. ఇప్పటికీ రాష్ట్రంలో ఎక్కడా కొత్త ఆసరా పింఛన్లు ఇవ్వడం ప్రారంభం కాలేదు. సోలార్ ఫైలట్ ప్రాజె క్టు కూడా కొండారెడ్డిపల్లికే. ఇప్పుడు 24గంటల విద్యు త్ కేవలం కొండారెడ్డిపల్లిలోనే సరఫరా అవుతుందంటే విచిత్రమే. రాష్ట్రంలోని మిగతా గ్రామాల వ్యవసాయానికి 10 నుం చి 12గంటల విద్యుత్ సరఫరా అయితే కొండారెడ్డిపల్లికి మాత్రం 24గంటల వ్యవసాయ విద్యుత్ సరఫరా అవుతుందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయానికి 24గంటల కరెంట్ వట్టి మాటలు. ప్రభుత్వం చెప్పేవన్ని అబద్ధపు మాటలే. వ్యవసాయానికి కరెంట్ 10గంటలు మించి రావడం లేదు. ఇందులో 2,3 గంటల పాటు కరెంట్ ట్రిప్ అవుతుంది. కరెంట్ సరిగ్గా రాకపోవడంతో భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం చేసే తమలాంటి రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. రెండకరాల్లో వరి, 5 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాను. వర్షాలు సరిగ్గా లేకపోవడంతో పత్తి పంటను నీరు అవసరం ఉంది. బోరు ద్వారా పత్తికి నీరందిస్తమంటే కరెంట్ సరిపోవడం లేదు. ప్రస్తుతం ఇస్తున్న కరెంట్ వరికి సరిపోతుంది.
– సత్యం రైతు,సర్వారెడ్డిపల్లి, వంగూర్ మండలం.
రైతులంటేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి వివక్ష. అధికారం కోసం అదిచేస్తాం.. ఇది చేస్తామంటూ హామీలు ఇచ్చారు. ఇప్పుడెమో అన్ని హామీలను మరిచిపోయారు. ఇదేమిని అడిగితే కేసులు నమోదు చేస్తున్నారు. ఎరువులు, వి ద్యుత్ కోసం ఇలా అన్ని ఇబ్బందులే.. ఏ గ్రామంలో చూసిన వ్యవసాయానికి 10,11గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారు. మం డలంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో మాత్రం వ్యవసాయానికి 24గంటల కరెంట్ ఇస్తున్నారు. కొండారెడ్డిపల్లిలోని రైతులకు ఒక న్యాయం, మిగతా గ్రామాల రైతులకు ఒక న్యాయమా.?.
– రాజేందర్‌రెడ్డి, రైతు,కోనేటిపూర్, వంగూర్ మండలం.
నీళ్లు ఉన్నాయి. కానీ కరెంటే లేదు.వచ్చి పోయే 12గంటల కరెంట్‌తో పంటలకు నీరు అందడం లేదు. 24గంటల కరెం ట్ వస్తదనే ఆశలో వరి నాటుకున్నాం. తీరా ప్రభుత్వం కరెంట్ ఇవ్వలేక చే తులెత్తేసింది. ఇదిచాలా అన్యాయం. శ్రీశైలం నిండుకుండలా ఉన్నా.. కాల్వలకు నీళ్లు వదలడానికి నాటకాలు. ఎరువు లు ఇవ్వడానికి యాప్‌లంటూ తిరకాసు. కరెంట్ ఇవ్వకుండా వేధింపులు. ఇటువంటి దుర్భర పరిస్థితులలో వ్యవసాయం ఎలా చేయాలి. నిజంగా రైతు వ్యతిరేక ప్రభుత్వం. రైతులకు ఖచ్చితంగా 24గంటల కరెంట్ ఇవ్వాలి. లేకుంటే రైతుల ఉసురు తగులుతుంది.
– ఆనంద్‌రెడ్డి, రైతు, రంగాపూర్, వంగూర్ మండలం.