పెంట్లవెల్లి, సెప్టెంబర్ 30 : ప్రభుత్వం చేసిన వ్యవసాయ రుణమాఫీ వర్తించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి కష్టాలపాలయ్యామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పెంట్లవెల్లి సొసైటీ పరిధిలోని కొండూరు, మల్లేశ్వరం, మంచాలకట్ట, మాధవస్వామినగర్, ఎంగంపల్లి తండా, రామాపురం గ్రామాలకు చెందిన రుణమాఫీ కాని రైతులు నిరసనకు దిగారు.
అంతకుముందు సొసైటీ కార్యాలయంలో విండో చైర్మన్ విజయరామారావు అధ్యక్షతన మహాజన సభ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా.. రైతులు అక్కడకు వెళ్లి అడ్డుకున్నారు. కార్యాలయం ఎదుట కొల్లాపూర్-పెబ్బేరు ప్రధాన రోడ్డుపై బైఠాయించి గంటన్నరసేపు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ప్రకటించిన మూడు విడుతల్లో పెంట్లవెల్లి సొసైటీలో రుణాలు తీసుకున్న 499 మంది రైతుల్లో ఒక్కరికి కూడా నయా పైసా మాఫీ వర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిలో మీకు ఓట్లేసినోళ్లు కనిపించడం లేదా.. అంటూ మంత్రిని ప్రశ్నించారు. రుణమాఫీ అవుతుందన్న నమ్మకంతో అవసరాల కోసం ఇతరుల వద్ద మళ్లీ డబ్బులు అప్పు తెచ్చామని, ఇప్పుడు మా పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశారు.