మద్దూర్, మే 26 : భూ సమస్యలను పరిష్కరించాలంటూ మద్దూర్ మున్సిపాలిటీలోని రెణివట్ల రైతులు మద్దూర్ తాసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టంలో మా భూమి సమస్యలను వెంటనే పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు.
319, 320, 359, 360, 210, 564, 565 సర్వే నెంబర్లలోని 66 ఎకరాల 11 గుంటల భూమిలో 13 మంది రైతులు 50 ఏండ్లుగా కాస్తులో ఉన్నారు. అయితే ఈ భూమికి ఓఆర్సీ సర్టిఫికెట్ అందజేసి నాలుగు సమాన భాగాలుగా చేసి ఇవ్వాలని అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కొత్త చట్టంతో తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయం తెలుసుకొన్న తాసీల్దార్ మహేశ్‌గౌడ్ అక్కడకు వచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పడంతో రైతులు శాంతించారు.