గద్వాల, మే 31 : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమకు కష్టాలు దాపురించాయని రైతులు వాపోతున్నారు. విత్తనాలు కొనుగోలు మొదలు కష్టపడి పండించిన పంట అమ్ముకోవడం వరకు పడుతున్న బాధలు వర్ణణాతీతం. ప్రస్తుతం వానకాల పంటల సీజన్ ప్రారంభం కాగా.. సీడ్ ఆర్గనైజర్లు రైతులను మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం జోగుళాంబ గద్వాల కలెక్టరేట్ ఎదుట రైతులంతా ఆందోళనకు దిగారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ రంజిత్‌కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీగా కర్షకులు పెద్ద సంఖ్యలో ఐడీవోసీ వద్దకు చేరుకొని మోకాళ్లపై కూర్చొని నిరసన తెలియజేశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీడ్ పత్తి రైతులకు జరుగుతున్న డోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ పత్తి రైతులపై జరుగుతున్న మోసాన్ని అరికట్టడంలో అటు వ్యవసాయశాఖ అధికారులు, ఇటు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. కంపెనీలు, ఆర్గనైజర్లు ప్రతి ఏడాది ఏదో రూపంలో రైతులను ముంచుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రస్తుత సీజన్‌కు సంబంధించి కొన్ని కంపెనీలు ప్యాకెట్ ధర తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాయని ఇది మంచి పద్ధతి కాదని సూచించారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ధరలు ఉండాలి కానీ.. కంపెనీలు ధరలు తగ్గించడం ఏమిటని ప్రశ్నించారు.
అన్నదాతలు కష్టపడి విత్తన పత్తి పండించి ఆర్గనైజర్లకు ఇస్తే వారు కంపెనీకు ఇస్తే జీవోటీ పేరుతో విత్తనాలు శాంపిల్స్ తీసి పాస్ అయినా ఫెయిల్ అయ్యాయని అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఇలా రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఆర్గనైజర్లతోపాటు కంపెనీలు వేధింపులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. రైతులకు సంబంధించి ఫెయిల్ అయిన విత్తనాలకు రీ శాంపిల్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. గద్వాల జిల్లాలో సుమారు 40 వేల ఎకరాల్లో 35 వేల మంది రైతులు సీడ్ విత్తన పత్తి సాగు చేస్తున్నారని తెలిపారు. కంపెనీలు ఇచ్చే వాస్తవ విత్తనాలను ఆర్గనైజర్లు రైతులకు ఇవ్వడం లేదని ఆరోపించారు.
కంపెనీలతో రైతులకు నేరుగా సంబంధాలు లేకపోవడం వల్ల ఆర్గనైజర్లు విత్తన ప్యాకెట్ ధరల విషయంలోనూ.. అడ్వాన్స్‌లు ఇచ్చే విషయంలోనూ.. రైతులను పలు రకాలుగా మోసం చేస్తున్నారన్నారు. రైతులు పంట పండించిన తర్వాత డిసెంబర్ నెలలో ఆర్గనైజర్ల ద్వారా ఆయా కంపెనీలకు రైతులు విత్తన పత్తి ఇస్తున్నారని, అయితే ఈ విధంగా సేకరించిన పత్తి విత్తనాలకు జీవోటీ పరీక్ష నిర్వహించి ఫలితాలు రావడానికి రెండు నెలలు గడువు ఉంటుందని చెప్పారు.
అయితే ఆర్గనైజర్లు మాత్రం మళ్లీ పంట సాగు చేసే వరకు రైతులకు వారు ఇచ్చిన విత్తనాల ఫలితాలు మాత్రం చెప్పకుండా.. పెట్టుబడి రూపంలో వారికి ఇచ్చిన అప్పుపై అదనపు వడ్డీలు వ సూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది రైతులను మోసం చేయడమే అన్నారు. జీవోటీ ఫలితాల్లో ఫెయిల్ కాకున్నా ఫెయిల్ అయినట్లు చూయిస్తూ రైతులకు చెల్లించాల్సి నగదు చెల్లించడం లేదని ధ్వజమెత్తారు. ఇలా విత్తన పత్తి రైతును ఆర్గనైజర్లు, కంపెనీలు మోసం చేస్తున్నాయని ఆగ్రహం చెందారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణకు వినతి పత్రం అందజేశారు. మోసాలు జరగకుండా కంపెనీలు, రైతులతో నేరుగా ఒప్పందాలు చేసుకోవాలని.. 2022 నుంచి ఇప్పటి వరకు ఫెయిల్ అయిన విత్తనాలను రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పందించిన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే కంపెనీలు, ఆర్గనైజర్లతో సమావేశం ఏర్పాటు చేశామని, రైతులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని వారిని ఆదేశించినట్లు తెలిపారు. రైతులకు అన్యాయం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆందోళనలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులతో పాటు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.