Gadwal | జోగులాంబ గద్వాల : సాగునీరు అందక పంటలు ఎండుతున్నాయి.. సాగునీరు ఇచ్చి పంటలు కాపాడాలని కోరుతూ ఆర్డీఎస్ రైతాంగం సోమవారం గద్వాల కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. అలంపూర్ తాలూకా పరిధిలో ఉండే 16 గ్రామాల రైతులు 20 వేల ఎకరాలలో వరి పంట సాగు చేశామని తెలిపారు. ప్రస్తుతం నీటి సరఫరా నిలిచిపోవడంతో పంటలకు సాగునీరు అందక ఎండిపోయే పరిస్థితి ఉందని రైతులు వాపోయారు. తమ పంటలు ఎండకుండా ఈ విషయము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమ పంటలు ఎండ కుండా చూడాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్‌కు ఫిర్యాదు చేశారు.
తుంగభద్ర నదిలో 15 టిఏంసిల నీళ్లు నిల్వ ఉన్నాయని 2 టిఎంసిలు నీటిని వదిలితే పంటలు పండుతాయని రైతులు జిల్లా కలెక్టర్ దగ్గర వేడుకున్నారు. గతంలో ఆర్డీఎస్ నీళ్ల కోసం కర్ణాటక రాష్ట్రంలోని ముఖ్యమంత్రి దగ్గరికి ఊపుకుంటపోయిన నాయకులు నీళ్లు ఎక్కడ తెంచిడ్రని రైతులు ప్రశ్నించారు. రైతులకు వెంటనే నీళ్లు వదలి పంటలను ఆదుకోవాలని కలెక్టర్‌కు రైతులు విజ్ఞప్తి చేసారు. వీరికి బీఆర్ఎస్, సీపీఐ ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు.