యూరియా కొరతతో ఉమ్మడి జిల్లా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయానికి యూరియా, డీఏపీ అందకపోవడంతో సాగుచేసిన పంటలు ఎదగడం లేదని ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఎరువుల కొరత ఉండడం ఏమిటని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవగాహన లోపం, నిర్లక్ష్యమే కారణమని మండిపడుతున్నారు.
ఈసారి వర్షాలు ముందస్తుగా కురవడం శుభపరిణామైనా.. అందుకనుగుణంగా అవసరమైన ఎరువులు అందించకపోవడంతో అధికారులు విఫలమయ్యారు. దీంతో పీఏసీసీఎస్ కేంద్రాల వద్ద గంటల తరబడి పడిగాపులు తప్పడం లేదు. పెద్ద ఎత్తున తరలివస్తుండడంతో కొన్ని చోట్ల పోలీస్ పహారాలో.. అన్నదాతలను క్యూలో నిల్చోబెట్టి అందించే దుస్థితి తలెత్తింది. నిరీక్షించినా చివరకు బస్తాలు అందుతాయో? లేదో? అన్న సందేహం.. అయితే ఆన్లైన్లో యూరియా ఉన్నట్లుగా చూపిస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
నాగర్‌కర్నూల్, ఆగస్టు 12 : నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఆయా ప్రాథమిక సహకార సంఘాల్లో సరఫరా చేస్తున్న ఎరువుల పంపిణీలో పైరవీకారులకు ఓ లెక్క, సన్న చిన్న కారు రైతులకు మరో లెక్కన ఎరువులను అందజేస్తున్నారు. పైరవీకారులకు, వారి కోసం ఫోన్ చేసిన రైతులకు అడినన్ని ఇస్తున్న అధికారులు సన్న చిన్నకారు రైతులను కొర్రీలు పెడుతున్నారు. వాస్తవానికి ఒక ఎకరం పంటకు ఒకటి నుంచి రెండు బస్తాల ఎరువును రైతు వాడుతుంటాడు. అయితే ఎరువుల కోసం పీఏసీసీఎస్కు వచ్చిన రైతులకు ఎకరానికి ఒక బస్తా మాత్రమే ఇస్తుండడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఒకటికి రెండుసార్లు ఎరువుల కోసం తిరగాల్సిన వస్తుందని, దీంతో రాకపోకల రవాణాకు ఆటో ఖర్చులు ఎక్కువవుతున్నాయని రైతులు మండిపడుతున్నారు. ఇస్తున్న ఒక బస్తా ఎరువుకు కూడా ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం, వేలిముద్ర వేయాల్సి వస్తుందని, మరొకరితో ఎరువులను తెప్పించుకునే పరిస్థితి లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇలా అవసరమైనప్పుడల్లా ఎరువుల కోసం తిరగడమే మాకు సరిపోతుందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని ఆయా పీఏసీసీఎస్‌ల ఆధ్వర్యంలో సరఫరా చేస్తున్న అన్ని కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితులు నెలకొం టున్నాయ న్న ఆరోపణలు రైతులు నుంచి వినిపిస్తున్నాయి. సరఫరా చేస్తున్న యూరియాను సైతం పోలీసు పహారా మధ్య అందజేయడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎరువుల కోసం రైతులకు పడిగాపులు తప్పడం లేదు. ఇలాంటి అలాంటి సంఘటనే గత రెండు రోజులుగా తాడూరు మండల కేంద్రంలోని పీఏసీసీఎస్ వద్ద కొనసాగుతున్నది. ఎరువుల కోసం సోమవారం తాడూరు పీఏసీసీఎస్కు వచ్చిన రైతులను సాయంత్రం వరకు స్టాక్ వస్తుందని అక్కడే పడిగాపులు కాయించారని ఆరోపిస్తున్నారు. తీరా సాయంత్రమైనా యూరియా రాకపోవడంతో చాలా మంది రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెనుదిరిగి వెళ్లిపోయా రు.
మంగళవారం సైతం చాలా మంది రైతులు ఎరువుల కోసం రాగా అప్పటికే స్టాక్ రావడంతో చాలా మంది పైరవీకారులకు అడిగినన్ని ఎరువులు అందజేశారని, మంగళవారం పడిగాపులు కాసిన రైతులకు మాత్రం సోమవారం వచ్చేసరికి ఒక్కొక్కటి మాత్రమే ఇచ్చేందుకు అధికారులు సుముఖత చూపడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులు చేస్తున్న తప్పిదాల వల్ల పదెకరాలు వ్యవసాయానికి పది బస్తాల ఎరువులు అవసరమైతే పదిసార్లు పీఏసీసీఎస్కు రావాల్సి వస్తుందని రైతులు మండిపడుతున్నారు. ఇలాగైతే యూరియా తీసుకెళ్లేందుకు ఆటో చార్జీలకే ఖర్చు పెట్టాల్సి వస్తుందని, తాము ప్రభుత్వం సరఫరా చేస్తున్న పీఏసీసీఎస్‌లో తీసుకోవడం కన్నా అధిక ధరలకు అయి నా గ్రామాల్లోనే దొరికిన చోటే యూరియా తీసుకోవడం మేలని రైతులు అభిప్రాయపడుతున్నారు.