జడ్చర్ల, నవంబర్ 21: ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పత్తిని అమ్ముకునేందుకు వస్తే అధికారులు పత్తిని కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారని, కాళ్లు పట్టుకున్నా అధికారులు కనికరించడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జడ్చర్ల పారిశ్రామిక వాడలోని మహేశ్ జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రానికి గద్వాల జిల్లా అలంపూర్‌కు చెందిన రైతు మల్లేశ్ గురువారం 90 క్వింటాళ్ల పత్తిని తీసుకువచ్చాడు.
వాహనంలోంచి సుమారు 36 క్వింటాళ్ల పత్తిని దించిన అధికారులు మిగతా పత్తిని కొనలేమంటూ చెప్పారు. దీంతో రైతు మల్లేశ్ సగం పత్తిని ఖరీదు చేసిన.. మీరు మిగతా పత్తిని ఎందుకు తీసుకోరంటూ సీసీఐ అధికారిని ప్రశ్నించాడు. వాహనంలో మిగిలిన పత్తి నాసిరకంగా ఉందని, కనీస నాణ్యత లేదని దానిని కొనలేమని అధికారి తేల్చిచెప్పాడు. దీంతో విస్తుపోయిన రైతు మ ల్లేశ్ ఎలాగైనా తీసుకోండి సారూ… మీ కాళ్లు మొ క్కుతానంటూ అధికారి కాళ్లపై పడ్డాడు.
మరో స్లాటు బుక్ చేసుకొని పత్తిని తీసుకురావాలని అధికారి చెప్పగా దూరం నుంచి వ చ్చామని, మరోస్లాటు బుక్ చేసుకుంటే తనవంతు వచ్చేసరికి మూడు, నాలుగు రోజులు పడుతుందని అధికారి కాళ్లావేళ్లా పడ్డాడు. మూ డు రోజులుగా పడిగాపులు కాస్తు న్నాం… పత్తి కొనకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే ఈ ఏడాది వర్షాలు అధికంగా కురిసి పంట దిగుబడి తగ్గిందని, చేతికి వచ్చిన పంటను అమ్ముకుందామం టే అధికారులు కొర్రీలు పెడుతున్నారని రైతులు వాపోతున్నారు.
కేంద్రానికి తీసుకువచ్చిన పత్తిని కొనకుండా అధికారులు ఇలాగే భీష్మించుకుంటే పత్తిని రోడ్లపై పారబోస్తామని రైతు లు పేర్కొన్నారు. కష్టపడి పండించిన పత్తిని అమ్ముకోవడానికి వస్తే కొనకుండా నాణ్యత లేదని, తేమ అధికంగా ఉందని సీసీఐ అధికారులు నానా యాతని పెడుతున్నారంటూ రైతులు కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళనకు పూనుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి రైతులను సముదాయించేందుకు ప్రయత్నించారు. సీసీఐ అధికారులతో మాట్లాడి పత్తిని కొనుగోలు చేసేలా చూస్తామని పోలీసులు ఇచ్చిన హామీతో రైతులు శాంతించారు.
ఈ విషయమై సీసీఐ అధికారి రమేశ్‌ను వివరణ కోరగా రైతు దాదాపు 90క్వింటాళ్లకు పైగా పత్తిని డీసీఎంలో తీసుకురావడం జరిగిందని, అందులో పైభాగంలో ఉన్న 36 క్వింటాళ్ల పత్తి నాణ్యతగా ఉండటంతో తీసుకోవడం జరిగింది. మిగతా పత్తి మధ్యలో పూర్తిగా నాణ్యతలేకుండా ముద్దలు, ముద్దలుగా మసకబారి ఉండడం వలన దానిని రిజెక్టు చేయడం జరిగింది. ఈ విషయమై మా పైఅధికారిని పిలిచి చూపించినా అతను కూడా రిజెక్టు చేశారు.
రైతులను ఇబ్బందులకు గురిచేయమని, తాము కూడా రైతులకు న్యాయం చేయాలనే చూస్తామని, కానీ ప్రభుత్వం నిర్ణయించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పత్తిని కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ఒకటి రెండు క్వింటాళ్లు బాగలేకుంటే ఎలాగోలా తీసుకుంటాం కానీ దాదాపు 60 క్వింటాళ్లు బాగలేకుంటే తీసుకోవడం ఎలా అని అన్నారు. అలాంటి పత్తిని కొనాలని నా కాళ్లు పట్టుకోబోయాడని అది మంచిది కాదన్నారు. రైతులు అంటే తనకు ఎంతో అభిమానమని వారికి నష్టం చేయకూడదనే మా ఉద్దేశ్యమన్నారు. రైతులు నాణ్యతగా పత్తిని తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరలు పొందాలి.