పెద్ద ధన్వాడ అష్టదిగ్బంధంలోకి వెళ్లింది. నాలుగు రోజుల కిందట గ్రామ శివారులో ఇథనాల్ కంపెనీ ఏర్పాటును నిరసిస్తూ రైతులు, ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకున్న సంగతి విదితమే.. ఈ నేపథ్యంలో పోలీసులు పలు గ్రామాలపై నిఘా ఉంచారు. ఎవరొ స్తున్నారు.. ఎవరు వెళ్తున్నారు.. గ్రామ శివారులో మఫ్టీలో ఉన్నారు. దీంతో ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనన్న టెన్షన్ సర్వత్రా నెలకొన్నది. గ్రామం నుంచి వెళ్లాలన్నా.. రావాలన్నా జంకుతున్నారు. మీరెన్ని నిర్బంధాలు పెట్టినా ఫ్యాక్టరీ ఏర్పాటును మాత్రం అనుమతించమని 12 గ్రామాల వాసులు తెగేసి చెబుతున్నారు.
అలంపూర్/రాజోళి, జూన్ 7 : ఇథనాల్ కంపెనీ బాధిత గ్రామాల్లో రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. ఏ రోజు ఏమవుతుందో, ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనని ఒళ్లంతా కండ్లు పెట్టుకుని ప్రజలు ఆందోళనలో ఉన్నారు. కంపెనీ నిర్మాణ స్థలం వద్ద గత నాలుగు రోజుల కిందట జరిగిన ఘటనకు సుమారు 41మందిపై పోలీసులు కేసులు నమోదు చేయగా వారిలో 12మందిని రిమాండ్ చేసి విషయం విదితమే. అయితే మిగతా వారి కోసం పోలీసులు గస్తీ ముమ్మరం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇంటి పెద్ద దిక్కును పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపడంతో ఇంటి వద్ద ఉన్న వారి కుటుంబ సభ్యులు భయాందోళనతో ఉన్నారు.
జరిగిపోయిన ఘటనకు సంబంధించి గ్రామంలోకి ఏ కొత్త వ్యక్తి వచ్చినా గ్రామస్తులు అనుమానంతో ఓ కంట కనిపెట్టి చూస్తున్నారు. వచ్చిన వారు సమాచార సేకరణ కోసం ఇథనాల్ కంపెనీకి చెందిన వా రా..? పట్టుకుపోవడానికి వచ్చిన పోలీసులా..? న్యూస్ కవరేజ్ కోసం వచ్చిన మీడియా వారా…? ఇంకేవరైనా ఉంటారేమోననే అనుమానంతో చూస్తున్నారు. వారి బాధలు చెప్పుకోవడానికి మాట్లాడాలంటే కూడా జంకుతున్నారు. గ్రామంలో ఏ వ్యక్తిని పలుకరించిన ఆవేదనతో కూడిన మాటలే వినబడుతున్నాయి.
గ్రామం చుట్టూ ఉన్న రోడ్లపై గ్రామానికి వెళ్లె దార్లలో, బయటకు వచ్చేదారుల్లోనూ అన్నింటా పోలీసులు మఫ్టీలో కాపలా కాస్తుండడంతో గ్రామస్తులు ఏ శుభ, ఆశుభ, కార్యాలకు వెళ్లల న్నా, పొలాలకు వెళ్లాలన్నా జంకుతున్నారు. పోలీసు వారి జాబితాలో పేర్లు నమోదై ఉన్న వ్యక్తులు కనిపిస్తే చెప్పపెట్టకుండా తీసుకెళ్లిపోతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రాత్రిళ్లు అయితే గ్రామంలోకి వచ్చి ఇండ్లల్లో పడుకున్న వారిని కూడా ఎత్తుకెళ్తారేమోనని భయంతో కం డ్లలో ఒత్తులేసుకుని జాగారం చేస్తున్న పరిస్థితి నె లకొంది.
మొత్తం మీద ఏ నిమిషానికి ఏం జరుగుతుందోననే ఆందోళనైతే గ్రామస్తుల కండ్లలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆడ మగ, పిల్లా, జల్లా ఎవరిని కదిలించినా దీనగాథ లే వినిపిస్తున్నాయి. ఎవరు వచ్చి మమ్మల్ని ఆదుకుంటారా అని ఎదురుచూస్తున్నారు. 12 గ్రా మాలకు సంబంధించిన సమస్యను పరిష్కారం చేయకుండా వారి స్వలాభాల కోసం నాయకు లు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్య ఏ పార్టీకి సంబంధించి కాదని అన్నం పండించే అన్నదాతలది అని బాధితు లు స్పష్టం చేశారు.
మా పాప పదో తరగతి సర్టిఫికెట్ కో సం వెళితే దొరికిచ్చుకొని పోలీ స్ స్టేషన్ తీసుకెళ్లారు. ఏం తప్పు చేశారని పోలీసులు పట్టుకుపోయారని గృహిణులు ప్రశ్నిస్తున్నారు. కాలుష్యం వెదజల్లే కం పెనీ వద్దని గుండెలు బాదుకుంటున్నా వారికి పట్టండం లేదా.. మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టే బదు లు ఇంత విషం ఇచ్చి సంపి మా శవాల మీద కంపెనీ కట్టుకొని బతకండంటూ మహిళలు ముక్త కంఠంతో వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
ఏ పని మీదనైనా బయటకు వెళ్లాలంటే కూడా భయంగా ఉందంటున్నారు. ఇండ్ల వద్ద ఇంటి ముందు రాత్రిళ్లు నిద్ర పోవాలంటే కూడా ఏం జరుగుతుందోననే ఆందోళనలో గ్రామస్తులంతా ఉన్నారు. ఏది ఏమై నా ప్రాణాలైనా ఇస్తాం.. కంపెనీ మాత్రం కట్టనివ్వం.. అంటూ అన్నదాతలు భీష్మించుకొని ఒకే మాట మీద ఉండటం గమనార్హం.