పెంట్లవెల్లి, మార్చి 28 : కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు నేటి వరకు పెంట్లవెల్లి సొసైటీలో ఒక్క రూపాయి రుణమాఫీకాక పోవడంతో పెంట్లవెల్లి సొసైటీ పరిధిలోని కొండూరు, మల్లేశ్వరం, మంచాలకట్ట, మాధవస్వామినగర్, ఎంగంపల్లితండా, రామాపురం, సోమశిల గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
అంతకు ముందు విండో చైర్మన్ విజయరామారావు అధ్యక్షతన సొసైటీ కార్యాలయంలో మహాజనసభ కార్యక్రమాని నిర్వహిస్తుండగా సభను ఆయా గ్రామాల రైతులు అడ్డుకొని సోసైటీ సమీపంలో పెబ్బేర్-కొల్లాపూర్ వేళ్లే ప్రధాన రహదారిపై మండుటెండను సైతం లెక్కచేయడకుండా సుమారు గంటన్నర పాటు రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. పెంట్లవెల్లి సొసైటీలో రుణాలు తీసుకున్నామని, త్వరలో మాఫీ అవుతుంది కదా అని ఇతరుల వద్ద డబ్బులు వడ్డీకి తీసుకున్నాం.. సొసైటీలో రుణమాఫీ కాకపోవడంతో ఇతరుల వద్ద తీసుకున్న అప్పుకు అసలు, వడ్డీ కట్టలేక తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులను మోసం చేయాలన్న ఉద్దేశంతోనే సొసైటీలో 499 మంది రైతులు పంట రుణాలు తీసుకుంటే మూడు విడుతల్లో ఒక్కరికంటే ఒక్కరికీ నయాపైసా కూడా రుణమాఫీ కాలేదని విమర్శించారు. అదేవిధంగా సొసైటీ చైర్మన్ విజయరామారావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోతుల వేంకటేశ్వర్లు, మండల నాయకులు రాజేశ్, సురేందర్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత ఆగస్టు 15వ తేదీ వరకు రూ.రెండు లక్షల వరకు అర్హులైన రైతులందరికీ భేషరతుగా రుణమాఫీ చేసి తీరుతామని ప్రగాల్బాలు పలికి రాష్ట్రంలో కొందరికి మాత్రమే రుణమాపీ చేసి సంబురాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.
పెంట్లవెల్లి సొసైటీలో 499మంది రైతులు రూ.3.26 కోట్లు పంట రుణాలు తీసుకున్నారని, ఇందులో ఒకరి కూడా నయాపైసా రుణమాఫీ కాలేదన్నారు. ఎన్నోమార్లు హైదరాబాదులోని సొసైటీ కమిషనర్‌ను వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేదన్నారు. ఏడు నెలల నుంచి పలువురు అధికారులకు వినతిపత్రాలు అందజేస్తున్నా.. నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం వెనుక రాజకీయ కక్ష సాధింపు చర్యలే కారణమని ఆరోపించారు.
ఇంత రాద్ధాం తం జరుగుతున్నా మంత్రి జూపల్లి కృష్ణారావు పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెంట్లవెల్లి సొసైటీలో రైతులు తీసుకున్న రుణాలను బేషరతుగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులను రైతులను సముదాయించి అక్కడి నుంచి పంపించి వేశారు. కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన 200మంది రైతులు పాల్గొన్నారు.