మూసాపేట, సెప్టెంబర్ 28 : అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు అధికారులు చేసిన చిన్న తప్పిదాలే నేడు వారికి మాఫీ వర్తించకపోవడానికి కారణంగా చెప్పొచ్చు. ఇలా ఎందరో కర్షకులు మాఫీ లేక ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో పూర్తిస్థాయిలో చేసేందుకుగానూ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. కానీ రుణమాఫీ వస్తుందా..? లేదా అనే అపనమ్మకంతోనే ఉన్న పలువురు మనోవేదన చెందుతున్నారు.
ఈ కోవలోకి మూసాపేట మండలం తుంకినీపూర్కు చెందిన పేద రైతు కుటుంబం చేరింది. మ్యాకల చిన్న రాములుకు గ్రామ శివారులో (పట్టా పుస్తకం నెంబర్ టీ01210090047లో 2.20 ఎకరాలు) భూమి ఉన్నది. ఈ భూమిపై సదరు రైతు మూసాపేట ఏపీజీవీబీలో రూ.1.20 లక్షల రుణం తీసుకున్నాడు. వడ్డీతో కలిపి ప్రస్తుతం రూ.1.70 లక్షలకు చేరింది. అలాగే అతడి భార్య మ్యాకల నీలమ్మ పేరుపై ఉన్న గ్రామ శివారులో (పట్టా పుస్తకం నెంబర్ టీ01210090090లో 25 గుంటలు) భూమి ఉండగా.. మూసాపేట ఏపీజీవీబీలో రూ.15 వేలు గతంలోనే లోన్ తీసుకోగా.. మిత్తితో కలిపి మొత్తం రూ.20 వేలకు చేరింది. వీరిద్దరు తీసుకొన్న మొత్తం రూ.1.90 లక్షలు మాత్రమే.. ప్రభుత్వ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని చెబుతున్నా.. ఈ పేద రైతు కుటుంబం అర్హులే.. కానీ అధికారుల తప్పిదంతో వీరికి రుణం నుంచి విముక్తి లభించలేదు.
ఆధార్‌కార్డు వచ్చిన తర్వాతే ధరణి పట్టాదార్ పాస్‌బుక్‌లు వచ్చాయి. అయితే ఆధార్‌లో మ్యాకల చిన్న రాములు అని.. పాస్‌బుక్‌లో మాత్రం మర్రిబాయి చిన్న రాములు అని.. పట్టా పాస్‌బుక్ ఇచ్చారు. అతడి భార్య పేరులో మర్రిబాయి అని ఉండడంతో వారు రుణమాఫీకి అర్హులు కాలేదని అధికారులు తెలిపారు. దీంతో సదరు రైతు కుటుంబం లబోదిబోమంటున్నది. అన్నీ వివరాలు చూశాకే బ్యాంకోళ్లు మాకు అప్పు ఇచ్చారని రాములు వాపోయాడు. గతంలో కేసీఆర్ పైసలు పడ్డాయి.. మరి ఇప్పుడెందుకు మాఫీ కాలేదని నిలదీస్తున్నాడు. కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయాయన్నాడు.