అచ్చంపేట, మే 15 : అన్నదాత కష్టానికి విలు వ లేకుండా పోయింది. ఆరుగాలం అన్నదాత పండించిన పంటను అమ్ముకోవడానికి నానా కష్టా లు పడాల్సి వస్తుంది. మండుటెండల్లో చెమటోడ్చి మొక్కజొన్న పంటను మార్కెట్‌కు తీసుకొచ్చిన రైతు లు 20 రోజులుగా యార్డులోనే నరకయాతన అనుభవిస్తున్నారు. నల్లమలలోని అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌యార్డులో ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులు చూస్తే రైతుల దుస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టంగా తెలుస్తోంది.
ప్రణాళిక కరువు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా సరైన ప్రణాళిక లేకపోవడంతో వందలాదిమంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అచ్చంపేట మార్కెట్‌యార్డులో ఎక్కడచూసినా మొక్కజొన్న బస్తాలు కనిపిస్తున్నాయి. కుప్పలుగా పేరుకుపోయిన ధాన్యం మధ్య రైతులు పడిగాపులు కాస్తున్నారు.
తూకం కోసం టోకెన్లు ఇచ్చి రోజుల తరబడి వేచిచూడటం, తూకం అయిన ధాన్యాన్ని ఎత్తుక పోవడానికి లారీలు రావడం లేదనే కారణంతో అధికారులు చేతులెత్తేయడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అచ్చంపేట మార్కెట్ యార్డు చుట్టుపక్కల మండలాలైన ఉప్పునుంతల, అమ్రాబాద్, బల్మూర్, పదర తదితర ప్రాంతాల నుంచి రైతులు పెద్ద ఎత్తున మొక్కజొన్న ధాన్యాన్ని అచ్చంపేట మార్కెట్‌కు తీసుకొచ్చారు. కానీ మార్కెట్లో స్థలం లేకపోవడంతో కొత్తగా వచ్చే రైతులు తమ ధాన్యాన్ని దింపుకోలేని పరిస్థితి ఏర్పడింది. కొందరు రైతులు ట్రాక్టర్లలోనే ధాన్యాన్ని ఉంచి రోజుల తరబడి వేచిచూస్తుండగా మరికొందరు రైతులు బస్తాలు దింపి కాపలా కాస్తున్నారు. మార్కెట్ యార్డులో మొత్తం ధాన్యంతో నిండిపోవడంతో నడిచేదారులు లేకుండా పోయాయి. రైతులు బస్తాల మధ్యే కూర్చొని భోజనం చేస్తున్నారు.
కొందరు రైతులు రాత్రులు బస్తాల పైనే నిద్రిస్తున్నారు. పగలు మండే ఎండ, రాత్రి దోమల బెడద మధ్య రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళ రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. తాగునీటి సౌకర్యం లేక, మరుగుదొడ్లు లేక మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలు పండించడానికి అప్పులు చేశాం, ఎరువులు, విత్తనాలు, కూలీల కోసం వడ్డీలకు డబ్బులు తెచ్చాం. ఇప్పుడు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కూడా ఇన్ని రోజులు మార్కెట్లో పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తిండి తినడానికి డబ్బులు లేవు. ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుంది అంటూ రైతులు కన్నీళ్లుపెట్టుకుంటున్నారు.
ప్రభుత్వం గన్నీ బ్యాగులు సరిపడా అందుబాటులో ఉంచకపోవడంతో రైతులే సొంతంగా డబ్బులు పెట్టి బస్తాకు రూ. 27-30 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.కవర్లు కూడా అధికారులు ఇవ్వకపోవడంతో వర్షం భయంతో రైతులే డబ్బులు ఖర్చుచేసి ప్లాస్టిక్ కవర్లు కొంటున్నారు. ఇప్పటికే అప్పుల భారంతో కుంగిపోయిన రైతులకు ఇది మరింత భారంగా మారింది. ఇటివల వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో రైతుల్లో మరింత భయం నెలకొన్నది. ఒకవేళ భారీ వర్షం కురిస్తే మార్కెట్ యార్డులో పేరుకుపోయిన వేలాది బస్తాల మొక్కజొన్న పూర్తిగా తడిసిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే కోట్ల రూపాయలు నష్టం వాటిళ్లే పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు.
ధాన్యం తడిస్తే మా జీవితాలు రోడ్డున పడతాయి.. అప్పులు ఎలా తీర్చాలి? పిల్లలను ఎలా చదివించాలి? కు టుంబాలను ఎలా పో షించాలి? అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం లారీలు అందుబాటులో లేవు, గోదాంలు ఖాళీగా లేవు.. నిల్వ సమస్య ఉందంటూ కారణాలు చెబుతున్నారని రైతులు మండిపడుతున్నారు. గోదాంలు లేకపోతే కొనుగోలు కేంద్రాలు ఎందుకు ప్రారంభించారు..? ముందస్తు ఏర్పాట్లు ఎందుకు చేయలేదు..? రైతులపై ప్రభుత్వానికి కనీస బాధ్యత లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. మార్కెట్లో తూకం ప్రక్రియ సక్రమంగా సాగడం లేదు. కొందరు రైతులకు టోకెన్లు ఇచ్చి 10నుంచి 15రోజులైనా తూకం వేయలేదు. మరికొందరు రైతులకు తూకం పూర్తయినా ధాన్యం ఎత్తకపోవడంతో వారు మార్కెట్‌ను విడిచి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. రాత్రింబవళ్లు బస్తాల వద్ద కాపలా కాస్తూ అవస్థలు పడుతున్నారు.
ఇంతటి దయనీయ పరిస్థితి నెలకొన్నా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు మార్కెట్‌ను పరిశీలించక పోవడం రైతులను మరింత కలచివేస్తోంది. రైతుల గోడును వినేవారు లేరని, మార్కెట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతల కష్టాలను గుర్తించి ప్రభుత్వం వెంటనే స్పందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అదనపు లారీలు ఏర్పాటు చేసి, గోదాంలు సిద్ధం చేసి, తక్షణమే ధాన్యాన్ని ఎత్తాలని కోరుతున్నారు. గన్నీ బ్యాగులు, కవర్లు ఉచితంగా అందించాలని, మార్కెట్లో తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాలు పడకముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
ఉప్పునుంతల నుంచి 200 బస్తాల మక్క అమ్మడానికి అచ్చంపేట మార్కెట్‌కు తేగా టోకెన్ ఇచ్చారు. 15 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు తూకం వేయలేదు. బ్యాగు లు అడిగితే ఇవ్వలేదు. బ్యాగు రూ. 27 లకు బయట తెచ్చుకున్నాం. ఒక దిక్కు ఎండ, మరో దిక్కు వర్షం వస్తుందనే భయంతో ఉంటున్నాం. బయట వ్యాపారులకు అమ్మితే రూ.1800 అడుగుతుండ్రు.. ప్రభుత్వం వద్ద లారీలు వస్తలేవంట. బయట అమ్మితే క్వింటాకు రూ.600 నష్టపోతామని అమ్మడం లేదు. ప్రభు త్వం పట్టించుకోవడం లేదు..
– బీ.పద్మ, మహిళా రైతు, ఉప్పునుంతల మండలం
నేను పదిరోజుల కిందట 70 బస్తాలు తెచ్చాను. కవర్ తెచ్చి కప్పి వర్షం వస్తే దేవుడిపైన భారం వేశాం. సర్కారు ఏమీ పట్టించుకోవడం లేదు. నిన్న ఒక్క లారీ పట్టిం డ్రు. అడుగు కూడా జరగలేదు. ఒక్క వాన పడితే ధాన్యం కొట్టుకుపోతది. రైతులు నష్టపోతారు. ఎందుకు రైతుల గురించి పట్టించుకుంటలేరో అర్థం కావడం లేదు. ఎమ్మెల్యే, కలెక్టర్ వచ్చి మా పరిస్థితి చూస్తే బాగుంటది. మార్కెట్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ప్రభుత్వం నుంచి నాలుగు బండ్లు పెడితే ఈపాటికి అయిపోతది. వర్షం రాకముందే ధాన్యం మొత్తం ఎత్తాలి.
– శేఖర్, రైతు, అచ్చంపేట