ప్రభువు తమ ప్రాంతానికి వస్తున్నాడని తెలిస్తే చాలు, పచ్చిక మేతకు సిద్ధపడే గొర్రెల్లా ప్రజలంతా వాలిపోయేవారు. ఆయన మాటలు వినడానికి ఆత్రుత చెందేవారు. ఎండావాన, ఆకలిదప్పులు వారిని ఇబ్బంది పెట్టేవి కావు. ప్రభువు మాటలే వారికి ఉపశమనం! ఆయన ముందున్న వారు దిక్కూమొక్కు లేని వారు. సంపదల రుచి తెలియని వారు. ఆనంద సౌఖ్యాలకు దూరమైనవారు. కడుపునిండా కష్టం, దుఃఖం దాచుకొని ఓదార్పు కోసం, ఆదరణ కోసం, భరోసాగల ధైర్యం కోసం నిరీక్షించే వారే!
‘మీరు ఈ లోకానికి ఉప్పులాంటి వారు’ అనే మాట ఆయన నోట వినబడింది. ఉప్పు ప్రాధాన్యం బాగా తెలిసిన వారు ‘ఓహో మనం సారవంతమైన ఉప్పులా ఉండాలన్నమాట!’ అని గ్రహించేవారు. ‘మీరు లోకంలో వెలిగించిన దీపాల్లా తిరగండి, కొండపై కట్టిన పట్టణంలా ఆదర్శవంతంగా బతకండి’ అని వారి జీవన శైలిని నిర్దేశించాడు ప్రభువు. కూటికి లేకున్నా ఈ సత్ప్రవర్తనలో మీరు సంపన్నులే అని భరోసా ఇచ్చాడు ప్రభువు! ‘అన్యులు మీ ప్రవర్తన చూసి… వీళ్లు దేవుడి బిడ్డలు కాబోలునని గుర్తించి మీరు నమ్మిన దేవుడ్ని ఘనపరచాలి. సకల శాస్ర్తాలూ నేర్చిన వారికన్నా, మూఢాచారాలకు పరాకాష్ఠ అయిన పరిసయ్యుల నీతి కన్నా, మీరు పాటించే నీతి చాలా గొప్పది. మీరెక్కడా కూడా తక్కువ వాళ్లం అనే భావనతో ఉండొద్దు’ అని ప్రభువు వారిని అక్కున చేర్చుకునేవాడు. ఉదయకాల దివ్యౌషధంలా ఆయన నైతిక ప్రోత్సాహామృతాన్ని మనసు నిండా పట్టించేవాడు….?
-ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024