దేవరకద్ర, సెప్టెంబర్ 10 : యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. బుధవారం మండల కేంద్రంలోని పీఏసీసీఎస్తో పాటు మండలంలోని వివిధ ప్రైవేట్ ఏజెన్సీల దగ్గర తెల్లవారు జాము నుంచే రైతులు యూరియా కోసం క్యూలో నిల్చున్నారు.
అయితే పీఏసీసీఎస్ అధికారులు ఆఫీస్ టైమ్‌కు వచ్చి ఈ రోజు యూరియా రాలేదని సూచించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంతర్రాష్ట్ర రహదారిపైకి చేరుకొని రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎస్సై నాగన్న తన సిబ్బందితో వచ్చి రైతులకు నచ్చజెప్పడంతో రాస్తారోకో విరమించారు. దాదాపు అరగంటపాటు రాస్తారోకో నిర్వహించడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.
ధన్వాడ, సెప్టెంబర్ 10 : యూరియా కోసం పీఏసీసీఎస్ సిబ్బంది రైతులకు టోకెన్లు ఇచ్చారు. బుధవారం రైతులు యూరియా కోసం పీఏసీసీఎస్కు చేరుకొని క్యూ కట్టారు. తీరా సిబ్బంది వచ్చి యూరియా రాలేదని, మరో రెండు రోజులు పట్టే అవకావం ఉందని చెప్పడంతో ఆగ్రహించిన రైతులు రాస్తారోకోకు దిగారు. ఎస్సై రాజశేఖర్ అక్కడికి చేరుకొని గురువారం రైతులకు యూరియా పంపిణీ చేయించేందుకు చర్యలు తీసుకుంటామని వ్యవసాయాధికారులతో మాట్లాడించడంతో రైతులు రాస్తారోకో విరమించారు.
మద్దూరు (కొత్తపల్లి), సెప్టెంబర్ 10 : యూరియా ఎప్పుస్తుందని రైతులకు రేయింబవళ్లు ఎదురుచూపులు తప్పడం లేదు. బుధవారం సాయంత్రం సీఎం రేవంత్ ఇలాకా.. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రానికి 300 బస్తాల యూరియా లోడ్ వచ్చింది. కానీ అక్కడేమో రెండు లారీలు యూరియా వచ్చినా సరిపడని పరిస్థితి. అయితే రైతులు ఎగబడడంతో లారీలోంచే సిబ్బంది టోకెన్లు అందుకున్న రైతులకు యూరియా బస్తాలు పంపిణీ చేశారు. టోకెన్లు లేని రైతులు నిరాశతో వెనుదిరిగారు.