నవాబ్‌పేట, మార్చి 9 : మండలంలోని వివిధ గ్రామాల్లో ఐకేపీ, సింగిల్‌విండో ఆధ్వర్యంలో వానకాలం సీజన్లో ప్రభుత్వం ఏ ర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యానికి బోనస్ ఇస్తామని కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది. మూడు నెలలైనా బోనస్ డబ్బులు అందక అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. బోనస్ వేస్తామంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి విక్రయించి తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్నరకం ధాన్యానికి బోనస్ డబ్బులు ఖాతా ల్లో పడకపోవడంతో రైతులు ప్రతిరోజూ వ్యవసాయ, బ్యాంకులు, ఐకేపీ, సింగిల్‌విండో కా ర్యాలయాలకు తిరగడం పరిపాటిగా మారిపోయింది.
నవాబ్‌పేట మండలంలోని ఆరు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సర్కారు ఏర్పాటు చేసింది. చాలా గ్రామాల్లో బోనస్ డబ్బులపై నమ్మకం లేక 70శాతం మంది రైతులు వరిధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు, నవాబ్‌పేట వ్యవసాయ మార్కెట్లో విక్రయించారు. కాగా, ఆలస్యంగా పంట కో సిన 30శాతం మంది రైతులు మాత్రం ప్రభు త్వం బోనస్ వేస్తుందని ఆశతో తమ సన్నరకం ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు విక్రయించారు. కొనుగోలు సమయంలో క్వింటాకు రూ.2,320 ధర పెట్టి కొనుగోలు చేశారు. మిగతా రూ.500 బోనస్ తర్వాత వారి ఖాతాల్లో వేస్తారని చెబితే నమ్మి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకున్నారు.
ఐకేపీ కేంద్రాల ద్వారా మొత్తం 377 మంది రైతులతో ప్రభుత్వం సన్నరకం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందులో ఇప్పటి వరకు 73మంది రైతులకు మాత్రమే బోనస్ డబ్బు లు పడ్డాయి. మిగతా 304 మందికి బోనస్ డబ్బులు పడలేదు. ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన రైతులకు రూ.66లక్షల 54,400 బోనస్ పెండింగ్‌లో ఉన్నది. చౌడూర్‌లో 36మంది రైతులకు రూ.6,64,400, గురుకుంటలో 50మంది రైతులకు రూ.9,99,00, కాకర్లపహాడ్‌లో 72మంది రైతులకు రూ. 14,95,800, లింగంపల్లిలో 52మంది రైతులకు రూ.10,81,000, లోకిరేవులో 60 మంది రైతులకు రూ. 13,54,200, నవాబ్‌పేటలో 34 మంది రైతులకు రూ. 10,60, 000 బోనస్ పెండింగ్‌లో ఉన్నది.
అలాగే సింగిల్‌విండో నుంచి కూడా మూడు కేంద్రా లు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేశారు. 100 మందికి రూ.20లక్షల రూపాయలు బోనస్ డబ్బులు రైతులకు రావాల్సి ఉన్నది. మండలంలో సుమారుగా 400 మందికి బోన స్ అందాల్సి ఉంది. రైతులంతా తమకు బోన స్ రాకపోవునా..అని ఎదురు చూస్తున్నారు. ధాన్యం విక్రయించి 4నెలలు దాటుతున్నా ఇంకా డబ్బులు పడటం లేదంటూ వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమకు బోనస్ డబ్బులు ఖాతాల్లో వేయాలని రైతులు కోరుతున్నారు.
బోనస్ పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవ మే. గతంలో కొంత మంది రైతులకు బోనస్ వేశాం. మిగతా రైతులకు బోనస్ వేయాల్సి ఉంది. ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లోనే జమచేస్తుంది.
– నాగమల్లిక, ఐకేపీ డీపీఎం
ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ. 500 బోనస్ ఇస్తామని చెబితే మోసపోయా. నేను చౌడూర్ కొనుగోలు కేం ద్రంలో సన్నరకం ధాన్యం అమ్ముకున్నా. 70 క్వింటాళ్ల సన్నరకం ధాన్యానికి రూ.35వేల బోనస్ రా వాల్సి ఉంది. డిసెంబర్ నెలలో అమ్మితే నేటికీ రాలేదు. అధికారులను అడిగితే మాకేమీ తెలియదు, నేరు గా బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు పడతాయని చెబుతున్నారు.
– మంచాల నర్సింహులు, రైతు, జంగమయ్యపల్లి, నవాబ్‌పేట మండలం
మా ఊర్లో చాలా మం ది రైతులు సన్నరకం ధా న్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్నారు. కానీ నేను సీఎం రేవంత్‌రెడ్డి మాటలు విని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్ముకున్నా. రూ.15వేల బోనస్ డబ్బులు రావాలి. ప్రైవే టు వ్యాపారులకు అమ్ముకున్నా నష్టపోయేవాడిని కాదు. పెట్టుబడికి డబ్బులు అవసరం ఉం ది. అప్పులు చేయాల్సి వస్తోంది.
– శంకరయ్య, రైతు, కారుకొండ