కొల్లాపూర్ : అధిక వర్షాలతో కొల్లాపూర్( Kollapur ) డివిజన్ పరిధిలో ఉద్యానవన పంటలు ( Horticultural crops ) దెబ్బతిన్నాయని ఉద్యానవన శాఖ అధికారి ఎం లక్ష్మణ్( Lakshman ) పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం పలు గ్రామాల్లో పర్యటించి రైతులకు పలు సూచనలు చేశారు. పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని ఆదిరాల గ్రామంలో గుమ్మడి తోటను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేయడంతో పాటు ఉద్యానవన పంట సాగు చేస్తున్న రైతులతో మాట్లాడారు.
కూరగాయలు..
టమాట, వంగ, మిరప , బంతి పంటల నారుమళ్లలో నారు కుళ్లు తెగులు నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి నేల పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలన్నారు. అధిక వర్షాల వలన కూరగాయల పంటలలో ఆకుమచ్చ తెగులు సోకుటకు అనుకూలమని వివరించారు. ఈ తెగులు నివారణకు ఒక గ్రాము కార్బెండజిమ్ లేదా 1 మి.లీ. ప్రోపికోనజోల్ మందును లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలన్నారు.
మిరప..
ముంపునకు గురైన పొలాల్లో మొక్కలు వెంటనే తేరుకోవడానికి లీటరు నీటికి 10గ్రాముల యూరియా , 10 గ్రాముల పంచదార కలిపిన ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలని వివరించారు.
మొక్కలు వడబడి, తలలు వాల్చినట్లయితే లీటరు నీటికి 5 గ్రాముల మెగ్నీషియం సల్ఫేటు కలిపిన ద్రావణం పిచికారి చేయాలని తెలిపారు.
ఇనుప ధాతు లోపంతో మొక్కలు పాలిపోయినట్లు కనబడితే 10 లీటర్ల నీటికి 50 గ్రాముల అన్నభేదీతో పాటు ఒక నిమ్మ చెక్కరసం కలిపి పిచికారి చేయాలన్నారు. కాపుతో ఉండి, వాలిపోయిన మొక్కలను జాగ్రత్తగా నిలబెట్టి మొదళ్ల చుట్టూ మట్టిని ఎగదోయాలని అధికారి లక్ష్మణ్ వివరించారు. నేల అదుసుకు వచ్చిన వెంటనే గొర్రుచేసి అంతరకృషి చేస్తే వెంటనే ఆరుతుంది. దీంతో పాటుగా ఎకరానికి అదనంగా 30 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్, 200 కిలోల వేపపిండి వేయాలన్నారు. మొక్కలు తేరుకున్న తరువాత స్థూల పోషణాల మిశ్రమాన్ని , సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని ఒక దాని తరువాత ఒకటి వారం రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారి చేయాలన్నారు.
పంటపై బాక్టీరియా ఆకుమచ్చ, కొనోఫారా వంటి తెగుళ్లు ఆశించే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా 10 లీటర్ల నీటికి 30 గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్ , ఒక గ్రాము స్త్రీప్టోసైక్లిస్ మందులను కలిపిన ద్రావణాన్ని పిచికారి చేస్తే వీటి వ్యాప్తిని అరికట్టవచ్చని పేర్కొన్నారు. వేరుకుళ్లు ఆశించిన చేలలో కాపర్ ఆక్సీ క్లోరైడ్ 30 గ్రాములు లేదా కార్బండిజమ్ 10 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణాన్ని మొక్కల మొదళ్లలో పోయాలన్నారు. కాయకుళ్లు, కొమ్మ ఎండు తెగులు వ్యాప్తి చెందకుండా ఒక మి.లీ. ప్రోపికోనజోల్ లేదా 0.5 మి. లీ డైఫెన్కోనజోల్ లేదా 2.5గ్రా. కాపర్ హైడ్రాక్సైడ్ లేదా 2.5 గ్రాము సాఫ్ మందులను లీటరు నీటికి కలిపి, మందులను ఒకటి మార్చి ఒకటి వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలన్నారు.
పంటను నాశించే వివిధ రకాల గొంగళి పురుగుల నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా అసిఫేట్ 1.5 గ్రాములు లేదా నొవాల్యురాన్ 0.75 మి.లీ. వంటి కీటక నాశిని మందులను పిచికారి చేయాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలు ముఖ్యంగా అధిక వర్షాలతో ఉద్యానవన పంటలు దెబ్బతిన్న వెంటనే తగు యాజమాన్య పద్ధతులు పాటిస్తే పంటలను కాపాడుకోవచ్చాని తెలిపారు. ఏదైనా సందేహం ఉంటే 91 89777 14460 నెంబర్ కు సంప్రదించాలని రైతులకు సూచించారు.