జడ్చర్ల, మే 9 : మక్కలను అమ్ముకోవడానికి జడ్చర్లలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే అధికారుల నిర్లక్ష్యంతో నెలరోజులుగా మార్కెట్‌యార్డులో పడిగాపులుగాస్తున్నామని, కొనుగోలు చేసిన మొక్కజొన్నను గోదాంలకు తరలించాలని శనివారం జడ్చర్ల-కల్వకురి 167వ జాతీయరహదారిపై రైతులు ధర్నా, రాస్తారోకోకు దిగారు. మూడుగంటలపాటు ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డుగా పెట్టి రాస్తారోకో చేయడంతో కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో విషయం తెలుసుకున్న జడ్చర్ల పోలీసులు ట్రాఫిక్‌ను దారి మళ్లించి వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా చర్యలు తీసుకున్నారు.
రైతుల నుంచి మక్కలు కొనుగోలు చేసినా వాటిని గోదాంలకు తరలించకపోవడంతో దాదాపు 40వేల బస్తాలు మార్కెట్లోనే ఉండిపోయాయి. దీంతో ధాన్యానికి సంబంధించిన చాలా మంది రైతులు ప్రతి రోజూ మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొన్నవి. అదేవిధంగా కొనుగోలు కేంద్రానికి రైతులు మక్కలు తీసుకొస్తుడడంతో మార్కెట్ మొక్కజొన్న ధాన్యంతో నిండిపోయింది. దీంతో ఆగ్రహించిన రైతులు ఎన్నాళ్లు ఇలా మార్కెట్లోనే పడిగాపులు కాయాలని, వర్షాలు వస్తే తమ పరిస్థితి ఎందని, తడిసిపోతే తమకు నష్టం వస్తుందని, అధికారుల తీరుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు.
మొక్కజొన్నను కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన మక్కలను ఎత్తుకెళ్లేదాక రోడ్డుపైనుంచి లేచేదిలేదని రైతు భీష్మించుకుని కూర్చున్నారు. విషయం తెలుసుకున్న మార్క్‌ఫెడ్ అధికారులు, తాసీల్దార్ ధర్నా దగ్గరకు వచ్చి రైతులతో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. ప్రతి గింజకొంటామన్న ప్రభుత్వం మక్కలను ఎందుకు కొనుగోలు చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్, ఎమ్మెల్యే రావాలంటూ నినాదాలు చేశారు. మక్కలను ఎత్తేవరకు లేచేదిలేదని తేల్చి చెప్పారు. రైతులు ధర్నాల చేస్తున్న విషయం తెలుసుకున్న జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ధర్నా వద్దకు చేరుకొని వారికి మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు.
బాదేపల్లి పీఏసీసీఎస్ సీఈవో సస్పెన్షన్
జడ్చర్ల, మే 9 : బాదేపల్లి పీఏసీసీఎస్ సీఈవో యాదగిరిని సస్పెండ్ చేసినట్లు జిల్లా సహాకార సంఘం సంయుక్త రిజిస్ట్రార్ కృష్ణ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. యాసంగి 2025-2026 మొక్కజొన్న సేకరణ వ్యవహరంలో నిర్లక్ష్యం వహించినందుకుగానూ కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయనను సస్పెండ్ చేసినట్లు అందులో పేర్కొన్నారు. యాదగిరి స్థానంలో మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకుగానూ తాత్కాలికంగా భూత్పూర్ పీఏసీసీఎస్కు చెందిన స్టాప్ అసిస్టెంట్ వెంకటేశ్‌ను నియమించినట్లు తెలిపారు.
పండించేందుకు మూడు నెలలైతే..అమ్మడానికి మూడు నెలలా?
రైతులు పంటలను పండించడానికి మూడునెలలు కష్టపడితే వాటిని అమ్ముకోవడానికి మూడునెలలు కష్టాపడాల్సి వస్తోందని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదురోజుల కిందట మార్కెట్‌కు వచ్చి మక్కలను కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన మక్కలను ఎత్తాలని తెలిపినా ఎత్తకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుందని ప్రశ్నించారు. రైతుల మక్కలను ఎత్తేవరకు ఇక్కడి నుంచి వెళ్లేదిలేదని, అప్పటి వరకు రోడ్డుపై ఉంటామని హెచ్చరించారు.
శుక్రవారం రాత్రి నాగసాల గ్రామం వద్ద గల గోదాంకు 40ట్రాక్టర్లలో మక్కలను తీసుకెళ్తే కేవలం నాలుగు ట్రాక్టర్లు మాత్రమే దించుకున్నారని, మిగతా వారు అంతా రాత్రంతా అక్కడే ఉండాల్సి వచ్చిందన్నారు. తిండితిప్పలు లేకుండా, కనీసం మంచినీళ్లు కూడా లేకపోవడంతో రైతులు ఆగ్రహంతో రోడ్డుపైకి వచ్చి ధర్నాకు దిగినట్లు వివరించారు. జడ్చర్ల మార్కెట్లో ఉన్న 40వేల బస్తాలు వెంటనే గోదాంకు తరలించాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇటువంటి చేతగాని ప్రభుత్వానికి బుద్ద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం సమస్య పరిష్కారం చేయకపోతే రైతు పక్షాన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుందని హెచ్చరించారు.
మాజీ మంత్రి సలహాతో మక్కలను స్టాక్ చేసిన అధికారులు
మార్కెట్లోని గోదాంలను, మార్కెట్‌యార్డులో స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మార్క్‌ఫెడ్ అధికారులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిలో గోదాంలు, లారీల కొరతను అధిగమించేందుకు పలు సూచనలు చేశారు. గోదాంల్లో స్థలం లేకుంటే మార్కెట్ యార్డులోని షెడ్లలో స్టాక్ చేయాలని అధికారులకు సూచించారు. మార్కెట్‌యార్డులో ఉన్న షెడ్లలో రైతుల నుంచి కొనుగోలు చేసిన మక్కలను స్టాక్ చేసి రైతులకు తక్చిట్టీలను ఇవ్వాలని, దీంతో రైతుల సమస్య తీరడంతోపాటు మక్కబస్తాలను స్టాక్ చేయడం జరుగుతుందని సలహా ఇచ్చారు. లక్ష్మారెడ్డి సలహాతో మార్కెట్‌యార్డులో ఉన్న షెడ్లలో మొక్కజొన్న బస్తాలను స్టాక్ చేయడం ప్రారంభించారు.
మక్కలబస్తాలను స్టాక్చేసే వరకు లక్ష్మారెడ్డి అక్కడే ఉన్నారు. అదేవిధంగా మక్కలలోడుతో ఉన్న ట్రాక్టర్లలోని బస్తాలతో పాటు మార్కెట్ యార్డులో ఉన్న మొత్తం 40వేల బస్తాలను మూడురోజుల్లో షెడ్లలో స్టాక్ చేసి మిగిలిన మక్కలను కొనుగోలు చేస్తామని అధికారులు తెలపడంతో రైతుల ధర్నాను విరమించారు. మళ్లీ అధికారులు మక్కలను ఎత్తకపోతే ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రఘుపతిరెడ్డి, మురళి, యాదయ్య, ఇంతియాజ్, కరాటేశ్రీను, రామ్మోహన్, జ్యోతి, కృష్ణారెడ్డి, వెంకటేశ్ ఉన్నారు.