నాగర్‌కర్నూల్, జనవరి 29(నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లు నాగర్‌కర్నూల్ జిల్లాలో పూర్తయ్యాయి. వానకాలంలో పండించిన ధాన్యానికి రైతులు గిట్టుబాటు ధర పొందారు. కేంద్రం ధాన్యం కొనుగోళ్లలో వెనుకంజ వేసినా రైతుల కోసం ఆర్థికంగా భారమైనా సీఎం కేసీఆర్ ముందడుగు వేశారు. ఈ క్రమంలో గత వానకాలంలో రైతులు సాగుచేసిన ధాన్యం సేకరణ నవంబర్‌లో ప్రారంభం కాగా, మూడు నెలల వ్యవధిలో దాదాపుగా ముగించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి 100శాతం డబ్బులను సైతం ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. వానకాలంలో నాగర్‌కర్నూల్ జిల్లాలో 1.21లక్షల ఎకరాల్లో వరి సాగుచేస్తారని వ్యవసాయశాఖ అంచనా రూపొందించింది. అందులో భాగంగా 320మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు భావించారు. ఈ క్రమంలో రైతుల ముంగిళ్లలోనే ధాన్యం కొనుగోలు చేస్తూ వస్తున్న ప్రభుత్వం గతంలో మాదిరిగానే సింగిల్‌విండో, మెప్మా, వ్యవసాయ మార్కెట్ యార్డుల ద్వారా జిల్లాలో 205కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది.
ధాన్యం గ్రేడ్ ఏ క్వింటాకు రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940చొప్పున మద్దతు ధరను ఖరారు చేసింది. ఇలా చేపట్టిన కొనుగోళ్లు పారదర్శకంగా ఉండేలా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించింది. ఇక రైతులు అమ్మిన ధాన్యానికి వెంటవెంటనే డబ్బులను నేరుగా ఖాతాల్లో జమ చేసింది. దీనివల్ల ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు మధ్య దళారుల బెడద తగ్గింది. తమ ధాన్యాన్ని నేరుగా కేంద్రాల్లో విక్రయించుకొని దర్జాగా డబ్బులు పొందారు. జిల్లాలో వ్యవసాయశాఖ అంచనాల ప్రకారం 2019 వానకాలంలో రూ.119కోట్ల విలువైన 65,900మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, యాసంగిలో రూ.325కోట్ల విలువైన రూ.1,77,213మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇక 2020సంవత్సరం వానకాలం రూ.168కోట్ల విలువైన 89,318మెట్రిక్ టన్నుల ధాన్యం, యాసంగిలో రూ.580కోట్ల విలువైన 3,07,633లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి.
అదేవిధంగా 2021 వానకాలంలో రూ.239కోట్ల విలువైన 1,22,304మెట్రిక్ టన్నుల ధాన్యం, యాసంగిలో రూ.189కోట్ల విలువైన 96,780మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. కాగా, ఈ వానకాలంలో ఇప్పటివరకు దాదాపుగా కొనుగోళ్లు ముగిశాయి. జిల్లాలో 1,21,276ఎకరాల్లో వరి సాగవుతుందని, దీంతో 320మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు 205 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే 19,155మంది రైతుల నుంచి 1,19,650మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లుగా వ్యవసాయశాఖ గణాంకాల ద్వారా తెలుస్తున్నది. దీనికి సంబంధించి రైతులకు రూ.243కోట్లను కూడా పూర్తిగా చెల్లించడం విశేషం. గతేడాది 1.25మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. కాగా, బయటి మార్కెట్లో రైతులు విక్రయించేందుకు మొగ్గుచూపడంతో అధికారుల అంచనా మేరకు కొనుగోళ్లు జరగలేదు.
1.19మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
ప్రభుత్వ ఆదేశాల మేరకు నాగర్‌కర్నూల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేశాం. జిల్లాలో 205 కొనుగోలు కేంద్రాల ద్వారా 19వేల మంది రైతుల నుంచి 1.19మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాము. రైతులు, అధికారుల సహకారంతో ప్రతి గ్రామంలో కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరించాము. రూ.243కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశాము.
– మోహన్‌బాబు, సివిల్ సైప్లె అధికారి, నాగర్‌కర్నూల్ జిల్లా