Kodangal Lift | మక్తల్, జూలై 08 : నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం ప్రభుత్వం రైతుల వద్ద నుంచి సేకరించే భూమికి ఎకరాకు రూ. 40 లక్షల పరిహార అందిస్తేనే ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు ఇస్తామని భూములు కోల్పోతున్న రైతులు ఆర్డీవో రామచంద్రనాయక్కు సూచించారు. మంగళవారం మక్తల్ మండలంలోని కాట్రేపల్లి, ఎర్నాగన్పల్లి గ్రామాల రైతులతో మంగళవారం నారాయణపేట ఆర్డిఓ రామచందర్ తన కార్యాలయంలో భూసేకరణ నిమిత్తం ప్రత్యేకంగా సమావేశమై భూసేకరణ కోసం చేపట్టే అవార్డు కోసం రైతులు సంతకాలు చేయాలని రైతులపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగిందని రైతులు తెలిపారు.
నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం రైతులు భూములు కచ్చితంగా ఇవ్వాల్సిందేనని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారంగా భూముల కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం పరిహార అందిస్తుందని, అంతకంటే ఎక్కువగా ఒక రూపాయి కూడా ప్రభుత్వం అందించలేదని ఆర్డిఓ రైతన్నలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా, భూ సేకరణ కోసం రైతులను బెదరించే ప్రయత్నం చేస్తున్నారని రైతులు వాపోయారు. రైతులు సామరస్యంగా ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు ఇస్తే ఓకే అని, లేకుంటే రైతుల ద్వారా నుండి ఏ విధంగా తీసుకోవాలో ప్రభుత్వానికి తెలుసా అని ఆర్డిఓ హెచ్చరిస్తూ తన ప్రసంగాన్ని రైతుల ముందు కొనసాగించడం ఏంటని రైతులు ప్రశ్నించారు. ఆర్డీవో రామచంద్ర చెప్పిన మాటలకు ఏ ఒక్క రైతు కూడా ఒప్పుకోకుండా, వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నటువంటి రైతన్నలకు, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా ఎర్నాగన్పల్లి, కాట్రేపల్లి గ్రామాలలో పూర్తిస్థాయిలో ఉన్న కొంత భూమిని రైతులు కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని వాపోయారు. ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టుకు రైతులం ఏమాత్రం వ్యతిరేకం కాదని, భూమికి తగ్గట్టుగా ఎగరానికి 40 లక్షల పరిహారం రైతులకు అందిస్తే ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు ఇవ్వడానికి రైతన్నలం సిద్ధంగా ఉన్నామని ఆర్డీవోకు ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ. ఆర్డీవో రైతుల మాటలను పట్టించుకోకుండగా, తమకు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ, రైతులను భూసేకరణకు ఒప్పుకోవాలని తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావడం ఏంటని రైతన్నలు వాపోతున్నారు. రైతులను కాపాడాల్సిన అధికారులే రైతులపై ఒత్తిడి తెస్తే రైతన్నలు ఎవరి దగ్గరికి వెళ్లి తమ బాధను చెప్పుకోవాలని భూముల కోల్పోతున్న రైతులు తమ ఆవేదనను నమస్తే తెలంగాణతో పంచుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆర్డిఓ రైతుల పక్షాన ఉంటాడా లేక ప్రభుత్వ పక్షాన ఉండి, భూముల కోల్పోయే రైతులకు సరైన న్యాయం చేసే దిశగా ముందుకు కలుగుతాడో వేచి చూడాల్సిందే.