మూసాపేట, ఏప్రిల్ 9 : అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు విత్తు మొదలుకొని కోత వరకు కష్టాలే మిగులుతున్నాయి. రైతుల కష్టాలు రోజురోజుకు వర్ణనాతీతంగా మారుతున్నాయి. అందుకు నిదర్శనమే మూసాపేట మండలంలోని జానంపేట గ్రామానికి చెందిన రైతు కందూరు రాములు ఒకరు. రైతు కందూరు రాములు మూసాపేట మండల కేంద్రంలో రెండు ఎకరాలు భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయ బోరు బావిపై ఆధారపడి వరి పంటతోపాటు, ఆకు కూరలు, కూరగాయాలు కూడా సాగుచేశాడు. కానీ కొన్ని రోజులుగా బోరు నుంచి తగినంత నీరు రావడం లేదు.
రోజు రోజుకు నీరు తగ్గి పోతున్నది. దీంతో వరి పంటలో ఇప్పటికే మూడు బందాలు ఎండిపోయినట్లు వాపోయాడు. అంతే కాకుండా పాలకూర, తోట కూర, మెట్టెం కూర తోట పూర్తిగా ఎండిపోవడంతో మిగిలిన వంకాయ తోటతోపాటు పుంటికూర (గోంగూర) తోటకు బిందెల ద్వారా నీరు పోస్తూ కాపాడుకోవడానికి సదరు రైతు నానా అవస్థలు పడుతున్నాడు. గత వారం రోజులుగా బిందెతో నీరు పోస్తూ దంటు దంటును కాపాడుకుంటూ వస్తున్నట్లు రైతు చెప్పుకోచ్చారు. కష్టం పోయినా పర్వాలేదు. కానీ పెట్టుబడి కూడా మీద పడే పరిస్థితి వచ్చిందని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.