వనపర్తి, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : సన్నరకం వడ్లకు రూ.500ల బోనస్ ఇస్తామంటూ కాంగ్రెస్ సర్కారు బోగస్ మాటలు చెప్పిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగిలో కష్టనష్టాలకోర్చి పంటలు పండించగా, కాంగ్రెస్ మొండిచేయి చూపించింది. కాంగ్రెస్ సర్కారు సన్నవడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని అన్నదాతలకు హామీ ఇచ్చింది. కేవలం అసలు డబ్బులు మాత్రం వేసి ఇప్పటి వరకు బోనస్‌పై గుట్టుచప్పుడు కాకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో యాసంగి వరి కొనుగోళ్లు ముగిసి మూడు నెలలు గడిచింది. వీటిపై ఏ అధికారిని అడిగినా వచ్చినప్పుడు ఇస్తాం అంటున్నారే తప్పా స్పష్టత లేకపోవడంతో అన్నదాతల ఆశలు ఆవిరి అవుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 5.18లక్షల క్వింటాళ్లు..
ఉమ్మడి జిల్లాలో 5లక్షల 18వేల క్వింటాళ్ల సన్నవడ్లు ప్రభుత్వం కొనుగోలు చేసిన అంచనా ఉన్నది. వీటికి ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసింది అదనం. అయితే, సర్కారు కొనుగోలు చేసిన సన్నవడ్లకు మాత్రమే బోనస్ అందుతున్నది. యాసంగి విక్రయాలు సవ్యంగా సాగక సన్నరకాన్ని ప్రైవేట్‌గా కూడా చాలా వరకు రైతులు విక్రయించుకున్నారు. ప్రభుత్వ బోనస్‌కు ఆశపడకుండానే అధికశాతం రైతులు వ్యాపారులకు అమ్ముకున్నారు. అయితే, ప్రభుత్వం ఇచ్చే బోనస్‌కు ఆశించిన రైతులకు ఇప్పటి వరకు జాడే లేకుండా పోయింది. మే నెలలో ధాన్యం అమ్ముకున్న రైతులు బోనస్ కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాల వారీగా రైతులకు బోనస్ అందాల్సి ఉన్నది.
259 కోట్ల బోనస్ పెండింగ్..
సన్నవడ్లకు క్వింటాకు రూ.500ల బోనస్ ప్రకటించిన ప్రభుత్వం వాటిని అందించడంలో మాట నిలబెట్టుకోవడం లేదు. 5జిల్లాల వారీగా దాదాపు 5.18లక్షల మెట్రిక్ టన్నుల సన్నవడ్లను కొనుగోలు చేశారు. ఈ లెక్కన సన్న ధాన్యానికి సుమారు రూ.259కోట్ల బోనస్ డబ్బులను అందుకోవాల్సిన రైతులున్నారు. వానకాలం సీజన్లో ఆలస్యంగా బోనస్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం యాసంగి సీజన్లోనూ చుక్కలు చూపెడుతుందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా, ధాన్యం అమ్ముకున్న రైతులు ఒక్కొక్కరు ఒక్కొక్క కష్టాన్ని, నష్టాన్ని అనుభవించారు. ఈసీజన్లో పడినంత ఇబ్బంది గతంలో ఎప్పుడూ చూడలేదని స్వయంగా రైతులే తమ అనుభవాలను వెల్లడించారు. తూకాల సమస్య, లారీలు లేవని, ధాన్యం సరిగా లేదన్న సాకులతో రైతులకు ముచ్చెమటలు పట్టించారన్న ఆవేదన అన్నదాతల్లో ఉన్నది. ఇన్ని కష్టాలు అనుభవించినా చివరకు బోనస్ డబ్బులు ఇచ్చి సంతోషపెడతారనుకుంటే అది కూడా నిరాశ, నిస్పృహలకు లోను చేస్తుందన్న ప్రచారం ఉన్నది.
మురిపించి మరిచిండ్రు..
బోనస్ అని ఆశపెట్టి రెండు నెలలు గడచినా బోనస్ ఇస్తలేరు. ఎప్పుడు వస్తుందో అధికారులను అడిగితే చెప్తలేరు. నేను 125 క్వింటాళ్ల సన్నరకం ధాన్యం అమ్ముకున్నా. మా సమిష్టి కుటుంబం మొత్తం 308 క్వింటాళ్లు అమ్ముకున్నాం. రూ.లక్షా 54వేలు వస్తాయని ఎదురు చూస్తూనే ఉన్నాం.
– జమ్ముల బాల్‌రెడ్డి, రైతు, ఏదుల
నాలుగు నెలలవుతున్నది..
నేను వడ్లు అమ్మి నాలుగు నెలలైంది. సన్నరకం వడ్లు 234 క్వింటాళ్లు అమ్ముకున్నా. బోనస్ కోసం అధికారులను అడిగితే మాకు తెలియదంటున్నారు. రూ.లక్షా 17వేల బోనస్ డబ్బులు రావాలి. ఏప్రిల్ 12న అమ్మితే ఇప్పటి వరకు బోనస్ మాటే లేదు.
– కురుమన్న, రైతు, దంతనూరు, మదనాపురం మండలం
ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పుడే బోనస్..
యాసంగిలో రావాల్సిన సన్నరకం వడ్ల బోనస్ డబ్బులు ఆగస్టులో విడుదల చేస్తారని సమాచారం ఉన్నది. రైతులకు కొంత ఆలస్యమైంది. ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పుడే బోనస్ డబ్బులు అందుతాయి. ఈ నెలలో తప్పనిసరి వచ్చే అవకాశం ఉన్నది.
– జగన్మోహన్, డీఎం, జిల్లా పౌరసరఫరాల శాఖ, వనపర్తి