గోపాల్పేట, అక్టోబర్ 7 : పది రోజులుగా పలు గ్రామాలకు నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలను వెంటనే పునఃప్రారంభించాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. ఏదుల మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏదుల మండల సాధన సమితి ఆధ్వర్యంలో దాదాపు 300 మంది రైతులు, నాయకులు, స్థానికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏదుల, అనంతపురం, చెన్నారం, చీర్కపల్లి, గొల్లపల్లి, ముత్తిరెడ్డిపల్లి, తుర్కదిన్నె, మాచుపల్లి, సింగాయపల్లి, రేకులపల్లి, గుండ్యావాల్యానాయక్ తండాలను కలిపి ఏదుల మండలంగా ఏర్పాటు చేశారన్నారు.
అయితే, నూతన తాసీల్దార్ కార్యాలయంలో పది రోజులుగా ముత్తిరెడ్డిపల్లి, తుర్కదిన్నె, మాచుపల్లి, సింగాయపల్లి, రేకులపల్లి, గుండ్యావాల్యానాయక్ తండా వాసులకు భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. దీంతో ఇబ్బందులకు గురవుతున్నామని, వెంటనే సేవలను కొనసాగించాలన్నారు. అనంతరం తాసీల్దార్ మల్లికార్జున్‌కు వినతిపత్రం అందజేశారు. తాసీల్దార్.. కలెక్టర్ ఆదర్శ్‌సురభి దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు వనపర్తి ఆర్డీవో పద్మావతి దీక్షా శిబిరం వద్దకు చేరుకోగా.. ఆమెకు కూడా వినతిపత్రం అందజేశారు. టెక్నికల్ సమస్యతో బదలాయింపు నిలిచిందని, మంగళవారం నుంచి కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అలాగే మండలకేంద్రంలో ఎంపీడీవో, ఏవో, ఎంఈవో, మహిళా సమాఖ్య కార్యాలయాలను కూడా ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఏదుల మండల యూనిట్‌గానే నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.