అమరచింత, ఏప్రిల్ 15 : సాగునీరు విడుదల చేయాలని రైతులు ఆందోళన బాటపట్టారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ కింద పంటలు సాగు చేసుకున్న రైతులకు ఇంకా రెండు వారాలపాటు సాగునీరు విడుదల చేయాలని జూరాల ప్రాజెక్టు ప్రధాన రహదారిపై అమరచింత, మస్తీపూర్, నందిమల్ల, మూలమల్ల, సింగంపేట తదితర గ్రామాలకు చెందిన రైతుల పెద్ద ఎత్తున భారీ కేడ్లను అడ్డంగా వేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు మాట్లాడుతూ యాసంగి పంట సాగు చేసే సమయంలో ఏప్రిల్ చివరి వరకు సాగునీరు విడుదల చేస్తామని చెప్పిన అధికారులు మార్చి రెండో వారం నుంచే సాగునీటి సరఫరాలో ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పుడు తమ పంటలు పొట్ట దశలో ఉన్నాయని ఇంకా రెండు వారాలు సాగునీరు విడుదల చేస్తే తప్ప వేల ఎకరాల్లో సాగుచేసిన వరి పంట చేతికి వచ్చే పరిస్థితి లేదన్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేసేంతవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని, భారీకేట్లతోపాటు ముల్లకంపను అడ్డంగా వేసి రోడ్డుపై బైఠాయించారు. దీంతో పెద్ద ఎత్తున ప్రాజెక్టు ఇరువైపులా అర కిలోమీటర్ వరకు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం అందుకున్న అమరచింత పోలీసులు ఆందోళన వద్దకు వచ్చి రైతులకు నచ్చజేప్పిన వినలేదు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఇక్కడికి వచ్చి సాగునీటి విడుదలపై స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కదిలేది లేదని రైతులు తెగేసి చెప్తున్నారు.