కల్వకుర్తి, ఆగస్టు 22 : మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 29వ ప్యాకేజీ ప్రధాన కాల్వకు సంబంధించి డీ-63 పిల్ల కాల్వ పూర్తి చేయకపోవడం వల్ల రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. రెండు మూడేళ్ల కిందట కాల్వ పనులు ప్రారంభించిన అధికారులు పనులను పెండింగ్‌లో ఉంచడంపై రైతులు మండిపడుతున్నారు. కల్వకుర్తి మండలం వెంకటపూర్ గ్రామ సమీపంలో కేఎల్ఐ 29వ ప్రధాన కాల్వకు అనుసంధానంగా డీ-63 కాల్వ పనులు ప్రారంభించారు. ఈ పనులు సగం చేసి మిగతా పనులకు ఎగనామం పెట్టారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాల్వ తవ్వడానికి కొంత మంది రైతులు అడ్డుపడుతున్నారని మూడేళ్ల కిందట కేఎల్ఐ అధికారులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ సదరు రైతులకు నోటీసులు జారీ చేశారు. వారు కాల్వ తవ్వడానికి తమకు ఏమాత్రం అభ్యం తరం లేదని, అవసరమైతే తమ పొలాల నుంచే కాల్వ తవ్వవచ్చని కలెక్టర్‌కు లేఖ ఇచ్చారు. ఆ తర్వాత అధికారులు ఇప్పుడే కాల్వ పనులు పూర్తి చేస్తామనే రీతిలో పనులు ప్రారంభించారు. ఆ తర్వాత పనులలో వేగం మందగించింది. క్రమక్రమంగా పనులు నిలిచిపోయాయి. దీని గురించి అధికారులను అడిగినా ఫలితం శూన్యం. సగం పూర్తయిన కాల్వలు గడ్డి చెత్తతో నిండిపోయాయి. కట్టిన కల్వర్టుల కింద నుంచి మట్టి తొలగించలేదు. చివర వరకు కాల్వ తవ్వలేదు. సగం తవ్వి కాల్వ వదిలివేయడంపై రైతులు తీవ్ర స్థాయిలో ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తుతున్నారు.
కాల్వల తవ్వకానికి ప్రభుత్వం ఎకరా భూమికి పరిరహారం కింద రూ.7లక్షలు మాత్రమే చెల్లించిందని రైతులు చెప్పారు. ఇప్పుడు బహిరంగ మార్కెట్లో ఎకరా భూమి రూ.50లక్షల వరకు ఉందని రైతులు అంటున్నారు. వ్యవసాయ పొలాలకు సాగునీరు కావాలి, అందరు రైతులు బాగుపడాలనే ఉద్దేశంతో కాల్వల తవ్వకానికి అడ్డు చెప్పకుండా భూములు ఇచ్చామని, భూములు తీసుకున్న ప్రభుత్వం కాల్వలు పూర్తి స్థాయిలో తవ్వకుండా పడావు పెట్టిందని రైతులు మండిపడుతున్నారు. మీకు కాల్వలు తవ్వడం ఇష్టం లేకపోతే.. మాభూమి మాకు ఇవ్వండి. మీరు ఇచ్చిన డబ్బులు తీసుకొండని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
డీ-63 పిల్ల కాల్వ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. కాల్వ పని పూర్తి చేసి సాగునీరు ఇస్తారా లేదా.. కాల్వకు సేకరించిన భూములను తిరిగి రైతులకు ఇచ్చి వేస్తారా.. రైతులకు భూములు తిరిగి అప్పగిస్తే. పరిహారం కింద ఇచ్చిన డబ్బులను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. కాల్వను పడావు పెట్టి రైతులను ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కాల్వతో రైతులకు లాభం లేదని భావిస్తే..సేకరించిన భూమిని రైతులుకు తిరిగి ఇచ్చేయాలి. కాల్వ విషయమై ఇంజినీరింగ్ అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. కాల్వ తవ్వే ముందు భూసేకరణకు కలెక్టర్‌తో నోటీసులు ఇప్పించి భ యపెట్టిన అధికారు లు పనులు పూర్తి చే సేందుకు ఎందుకు స్పందించడం లేదో సమాధానం చెప్పాలి.
– బండెల రాంచంద్రారెడ్డి, రైతు,వెంకటాపూర్, కల్వకుర్తి మండలం