బిజినేపల్లి, ఆగస్టు 16 : రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. వర్షాలు ఫుల్‌గా కురుస్తుండడంతో యూ రియా అవసరం ఉన్నా సరైన సమయంలో అందుబాటులో లేదు. శనివారం బిజినేపల్లి పీఏసీసీఎస్, మనగ్రోమోర్ వద్ద యూరియా కోసం రైతులు బారులుదీరారు. గంటల తరబడి.. తిండితిప్పలు, నిద్రాహారాలు మానుకొ ని.. పడిగాపులు కాస్తున్నారు.
పట్టాబుక్ జిరాక్స్, ఆధార్ జిరాక్స్‌తోపాటు థంబ్ ఇంప్రెషన్ చేయాల్సి ఉండడంతో ఒక్కో రైతుకు యూరియా అందించేందుకు సుమారు ఐదు నుంచి 10 నిమిషాల సమయం పడుతున్నది. దీనికి తోడు ఎకరా పొలానికి ఒక యూరియా బస్తా.. రెండు, అంతకుపైబడి ఉంటే రెండు బస్తాలకుమించి ఇవ్వడం లేదు. మరిన్ని బస్తాలు కావాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.. యూరియాతోపాటు నానో లిక్విడ్‌ను బలవంతంగా అంటగడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
పంటలు కళకళలాడుతూ.. ఏపుగా పెరుగుతున్న సమయంలో అవసరమైన యూరియా అందుబాటులో లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆన్లైన్లో యూరియా ఉన్నట్లు చూపిస్తున్నా.. కొందరు కృత్రిమ కొరత సృష్టించడం వల్లే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం సీజన్‌కు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచడంతో రైతులు సంబురంగా సాగు పనులు చేసుకున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి యూరియాను అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.
ధరూరు, ఆగస్టు 16 : మండల కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్ దుకాణం వద్ద యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున గుమిగూడారు. యూరియా బస్తాలు విక్రయించాలని డీలర్‌ను కర్షకులు వేడుకున్నారు. అయినా అందుబాటులో లేవని చెప్పడంతో చేసేది లేక పలువురు నిరాశతో వెనుదిరిగారు. ప్రైవేటు ఎరువుల దుకాణాల నిర్వాహకులు కృత్రిమ కొరత సృష్టించి బయట మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనిఅన్నదాతలు ఆగ్రహం చెందుతున్నారు.