ఖిల్లాఘణపురం, ఆగస్టు 2 : కొన్నిరోజులుగా ముసురు వర్షాలు కురవడంతో సాగునీరు సకాలంలో రావడంతో రైతన్నలకు సాగుపై ఆశలు చిగురించాయి. దీంతో రైతన్నలు తమ పంట పొలాల్లో సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఒరిజినల్, డూప్లికేట్ అడుగుపిండి సంచులు ఒకేలా ఉం డడంతో రైతన్నలు అయోమయం లో పడ్డారు. వివరాల్లో వెళ్తే మండలకేంద్రంతోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో రైతులు కొనుగోలు చేస్తున్న అడుగు పిండి సంచుల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొన్నది.
మామిడిమాడ గ్రామంలో నకిలీ అడుగు పిండి రైతులు కొనుగోలు చేయడంతో విషయం బయటపడింది. మార్కెట్లో లభ్యమవుతున్న ఒరిజినల్, డూప్లికేట్ సంచు లు దాదాపు ఒకే విధమైన రంగు, డిజైన్, ముద్రణతో ఉండడంలో అసలు ఉత్పత్తి ఏది, నకిలీది ఏదో గుర్తించడం రైతులకు కష్టంగా మా రింది. వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో పంటలకు అవసరమైన అడుగు పిండి కొనుగోలు చేసే రైతులు నకిలీ ఉత్పత్తుల బారిన పడతామేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ ఉత్పత్తులు వాడితే పంట దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు, సంబంధిత కంపెనీ ప్రతినిధులు ఒరిజినల్ సంచుల ప్రత్యేక గుర్తింపు లక్షణాలను రైతులకు తెలియజేయాలని, గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రైతులు కోరుతున్నారు. అలాగే నకిలీ ఉత్పత్తుల విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, అక్రమాలకు పా ల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులు మోసపోకుండా ఒరిజినల్ ఉత్పత్తుల గుర్తింపుపై వెంటనే స్పష్టత ఇవ్వాలని రైతులు అధికారులను కోరుతున్నారు. దీని పై వ్యవసాయ అధికారి మల్లయ్యను వివరణ కోరగా అడుగు పిండి బస్తాపై ఉన్న మ్యానుఫ్యాక్చర్ తేదీ, బార్‌కోడింగ్ పరిశీలిస్తే అది ఒరిజినల్ లేదా డ్యూప్లికేటా అని క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.