బాలానగర్, నవంబర్ 16 : ట్రిపుల్ఆర్ నిర్మాణంపై ఆందోళన చెందుతున్నారు. పేదల భూములను నాశనం చేస్తూ ప్రభుత్వం ప్రాంతీయ వలయ రహదారి చేపట్టడం సరికాదన్న అభిప్రాయాలు బాలానగర్ మండలంలోని చిన్నసన్న కారు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం రోడ్డు అలైన్మెంట్ ప్రకటించిన నాటి నుంచి మండలంలోని చిన్నరేవల్లి, పెద్దరేవల్లి, అప్పాజిపల్లి, బోడజానంపేట, వనంవానిగూడ, గౌతాపూర్, పెద్దాయపల్లి, గుండేడు, ఉడిత్యాల, సూరారం గ్రామాల్లోని రైతులతోపాటు, అలైన్మెంట్ చేసిన గ్రామాల పరిధిలోని పలు గిరిజన తండాల్లోని రైతులు దిగాలు చెందుతున్నారు. తమ విలువైన భూములు ట్రిపుల్ఆర్ కింద పోతాయన్న భయంతో కంటినిండా కునుకుపోవడం లేదని తెలిసింది. కుటుంబాలకు తిండిపెడుతున్న బంగారం వంటి భూములను కోల్పోతే భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్న వారిలో మెదులుతున్నది.
బాలానగర్ మండలంలోని 10 గ్రామాలు, పలు గిరిజన తండాల పరిధిలోని 270 సర్వే నెంబర్ల మీదుగా త్రిపుల్ఆర్ నిర్మాణం జరగనున్నట్లు సమాచారం. హెచ్ఎండీఏ అలైన్మెంట్ చేసిన ప్రకారం ఈ మార్గంలో అన్నీ పంట పొలాలే. చాలావరకు నిరుపేదలు, గిరిజన రైతులకు సంబంధించి వ్యవసాయ భూములే. అయితే త్రిపుల్ఆర్ నిర్మాణం జరిగితే వందల ఎకరాల్లో పంటపొలాలు, వ్యవసాయ బోర్లు, గ్రామాల పరిధిలోని చాలా ఇళ్లు రోడ్డు నిర్మాణంతో నష్టపోతామని రైతులు, గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సెప్టెంబర్ 15వ తేదీ వరకు హెచ్ఎండీఏ అధికారులు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. గ్రామాల వారీగా, వ్యక్తిగతంగా ప్రజలు తమకు ట్రిపులార్ నిర్మాణం ససేమిరా వద్దంటూ దరఖాస్తులు ఇచ్చారు. గతంలో బాలానగర్ సమీపంలో చేసిన అలైన్మెంట్ ప్రకారం ట్రిపుల్ఆర్ ఏర్పాటు చేయాలని, అలా అయితే పేదల భూములకు ఎలాంటి నష్టం ఉండదని అధికారులకు విన్నవించుకున్నారు. తమ గ్రామాలు, పొలాల మీదుగా రోడ్డు నిర్మాణం చేయొద్దంటూ జిల్లా కలెక్టర్‌కు ఇతర ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా మొరపెట్టుకున్నారు.
వారం రోజల కిందటే బాలానగర్ మండలంలోని గుండేడు శివారులోని పంచాంగులగడ్డ తండాలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి హాజరైతే పలువురు రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. ట్రిపుల్ఆర్ను రద్దు చేయించాలంటూ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. రియల్ వ్యాపారులు, బడా నేతల భూములను వదిలేసి, సన్న, చిన్న కారు రైతుల భూముల మీదుగా ట్రిపుల్ఆర్ నిర్మాణం చేయడం ఏమిటని, భూములు పోతే మేము ఎట్లా బతకాలంటూ ప్రశ్నించారు.
ట్రిపుల్ఆర్ నిర్మాణంతో పంచాంగులగడ్డతండా పరిధిలోనే 40 మందికి పైగా రైతులు పొలాలు కోల్పోతున్నామని తండాకు చెందిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై బాలానగర్ తాసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డిని సంప్రదించగా.. హెచ్ఎండీఏ అధికారులు ఇచ్చిన అలైన్మెంట్ మినహా తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. గతంలో బాలానగర్ శివారులోని పెట్రోలు బంక్ సమీపంలో ట్రిపుల్ఆర్ నిర్మాణం కోసం సర్వేచేశారని, ఇటీవల దారి మార్చి కొత్తగా అలైన్మెంట్ చేశారని తెలిపారు. అయితే అధికారికంగా తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. కాగా ప్రజల అభ్యంతరాల మేరకు ట్రిపుల్ఆర్ నిర్మాణం పనులు జరగకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
అలైన్మెంట్ పారదర్శకంగా జరగాలి. బంజరు భూములు, వ్యవసాయానికి పనికిరాని పొలాలను వదలి పంటలు పండే భూముల్లో ట్రిపుల్ఆర్ రోడ్డును నిర్మించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుంది. పంచాంగులగడ్డతండా సమీపంలో నాకు నాలుగు ఎకరాల పొలం ఉన్నది. రోడ్డులో మొత్తం భూమి పోతుంది. పంటలు సాగుచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. రోడ్డు నిర్మాణంలో ఆ భూమిపోతే మా కుటుంబం ఏం చేసుకుని బతకాలి?
– కేతావత్ దామ్లానాయక్, పంచాంగులగడ్డతండా, బాలానగర్ మండలం
ధనవంతుల భూములు విడిచిపెట్టి పేద రైతుల పొలాల్లో రోడ్డును నిర్మించాలనుకోవడం సరికాదు. ట్రిపుల్ఆర్ రోడ్డు నిర్మాణం కోసం అధికారులు వీలు మేరకు సర్వే చేశారు. బడానేతల పొలాలున్న చోట్ల రహదారిని పాములా మెలికలు తిప్పి అలైన్మెంట్ చేశారు. నాకు 1.20 ఎకరాల పొలం ఉన్నది. ట్రిపుల్ఆర్ నిర్మిస్తే ఆ కొద్దిపాటి పొలం కూడా పోతది. మేము ఏం చేయాలని.. ఎలా బతకాలి. ప్రభుత్వం అలైన్మెంట్ మార్చుకొని మా భూములు మాకే ఉండేలా చూడాలి. కాదంటే రోడ్డు నిర్మించాలని చూస్తే భూములు ఇచ్చేది లేదు.
– కేతావత్ వాచ్యానాయక్, పంచాంగులగడ్డతండా, బాగానగర్ మండలం