భూత్పూర్, సెప్టెంబర్ 1 : యూరియా కోసం భూత్పూర్లో రైతులు తెల్లవారు జామునుంచే బారులు తీరారు. చెప్పులు, రాళ్లపై తమ తమ పేర్లను రాసి క్యూలైన్లో పెట్టారు. ఆగ్రో రైతు సేవా కేంద్రం వేచి ఉన్న రైతులకు ఇప్పుడే యూరియా రాదని షాపు యజమాని చెప్పడంతో రైతులు కన్నెర్ర చేశారు. క్యూలైన్లో మూడో తరగతికి విద్యార్థిని సహస్ర ఉండడం గమనార్హం. ఎందుకమ్మ నీవు క్యూలైన్ ఉన్నావని అడుగగా మాకు యూరియా కావాలని చెప్పింది. అనంతరం రైతులు పెద్ద ఎత్తున మహబూబ్‌నగర్ రోడ్డుపై చేరుకొని ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలిసిన వెంటనే పాలమూరు నుంచి మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి వచ్చి పాల్గొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో యూరియా కష్టాలు లేవని గుర్తు చేశారు. నాడు ముందుచూపుతో 30-40 శాతం యూరియాను వేసవిలోనే స్టాక్ తెప్పించేవారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా లేక కష్టాలు పడుతున్నారని ఆగ్రహం చెందారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే నచ్చదన్నారు. పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోడం లేదని విమర్శించారు. పోలీసులు రైతులతో మాట్లాడి నచ్చజెప్పడంతో గంటకుపైగా చేపట్టిన ఆందోళనతో విరమించారు.
వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోగా పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ కదిరె అశోక్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్థులు సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచులు సత్తూర్ నారాయణగౌడ్, మనెమోని సత్యనారాయణ, నర్సింహ్మాగౌడ్, వెంకటయ్య, ఆంజ నేయులు, నాయకులు మురళీధర్‌గౌడ్, గోప్లాపూర్ సత్యనారా యణ, వెంకట్రాములు, గడ్డం రాములు, సాధిక్, వివిధ గ్రామాల నుండి వచ్చిన 400మంది రైతులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 1 (నమస్తే తె లంగాణ ప్రతినిధి) : ఎ రువుల కోసం అన్నదాతలు కన్నెర్ర చేశారు. 15 రోజుల నుంచి యూరియా కావాలని రాత్రనకా.. పగలనకా.. తిరుగుతున్నా ఇవ్వకపోవడంతో సోమవారం రైతులు మహబూబ్‌నగర్‌లో దండయాత్ర కొనసాగించారు. వందలాదిగా రైతులు రోడ్డుపైకిచేరుకొని సర్కారుకు వ్యతిరేకంగా నినాదిస్తూ ఆందోళన చేపట్టారు.
ఎరువులు ఇస్తామని చెప్పిన అధికారులు పత్తాలేకుండా పోవడంతో అసహనంతో ఊగిపోయారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యూరియా దొరకక రైతులు ఇబ్బందులు పడ్డారు. భూత్పూర్లో రాస్తారోకో చేయగా.. ధన్వాడ మండల కేంద్రంలో తెల్లవారు జామునుంచే క్యూలైన్లో చెప్పులు పెట్టి నిరీక్షించారు. వనపర్తి జిల్లాలో యూరియా దొరకని ఓ రైతు కడుపుమండి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాలో కూడా ఎరువులు దొరకక రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు.
ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఎరువుల కోసం రైతులు తెల్లవారు జామునే డీసీఎంఎస్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఉదయం 10గంటలైన అధికారులు పట్టించుకోకపోవడం.. ఇస్తారో లేదో అన్న ఆందోళనతో రైతులు ఆగ్రహంతో ఉగిపోయారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే ఉన్న పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో పాతబస్టాండ్ వద్ద రోడ్డుకు అడ్డంగా కూర్చుకున్నారు. అయినప్పటికీ యూరియా సరఫరాపై స్పష్టమైన హామీ రాకపోవడంతో రైతులు ర్యాలీగా తరలివెళ్లి బస్టాండ్ వద్ద అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకోకు దిగారు.
దీంతో అక్కడికి చేరుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఇతర పోలీసులు భారీ ఎత్తున అ క్కడికి చేరుకొని పరిస్థితి చేయిదాటకుండా చూశారు. కాగా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకునేందుకు సిద్ధమవ్వగా రైతుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని భయంతో మధ్యాహ్ననికి వాయిదా వేశారు. రాస్తారోకోకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు బస్సులు ఆటోలు, ప్రైవేట్ వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో పోలీసులు ట్రాఫిక్‌ను డైవర్ట్ చేశారు. భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
జిల్లా కేంద్రంలో రైతులు యూరియా కోసం ఆందోళన చేపట్టిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిలు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు చేరుకొని యూరి యా కొరత లేదని ప్రభుత్వం బుకాయిస్తుందని అనగానే రైతులు మండిపడ్డారు. వ్యవసాయ పనులు మానుకొని దాదాపు 15 రో జుల నుంచి తిరుగుతున్నా యూరియా దొరకడం లేదని.. సకాలంలో యూరియా వేయకపోతే పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ హయాంలో ఎన్నడైనా యూరియా కోసం రైతు లు ఇలా నిలబడ్డారా? అని మాజీ మంత్రులు ప్రశ్నించగా.. ఇది మా ఖర్మ అని రైతులు అన డం కనిపించింది. చివరకు మాజీ మంత్రులు జోక్యం చేసుకుని రైతుల పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హుటాహుటినా జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్ అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. యూరియా సరఫరా చేసేందుకు రైతులకు టోకెన్లు ఇచ్చామని అనగానే రైతులు భగ్గుమన్నారు.
దాదా పు రెండు వారాల నుంచి తిరుగుతున్నా పట్టించుకోక తిరిగి తమనే దోషులుగా చేస్తారా అని మండిపడ్డారు. అప్పటికే మహబూబ్‌నగర్ ఆర్డీవో నవీన్, ఇతర అధికారులు అక్కడికి చేరుకున్నారు. మాజీ మంత్రుల ప్రశ్నలకు, రైతులు అడిగిన దానికి నీళ్లు నమిలారు. స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదన్నారు. జిల్లాకు స్టాక్ తెప్పించి రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా చేయాలని మాజీ మంత్రులు కోరారు. చివరకు వ్యవసాయ అధికారి, పో లీసుల హామీతో రైతులు ఆందోళన విరమించారు. అ ప్పటికే పెద్ద ఎత్తున నిలిచిన వాహనాలను క్లియర్ చేశారు.