మాగనూరు: ధాన్యం దిగుబడి లేని ఊర్లకు గన్ని బ్యాగులు వెళ్తున్నాయని దిగుబడి ఎక్కువగా ఉన్న ఊర్లకు గన్ని బ్యాగులు రావడంలేదని నారాయణపేట జిల్లా అడిషనల్ కలెక్టర్(Additional Collector) సంచిత్ గంగ్వార్( Sanchit Gangwar) తో రైతులు ఆవేదన వెల్లుబుచ్చుకున్నారు. నేరడగం గ్రామానికి గన్ని బ్యాగులు లారీలు రావడంలేదని, డబ్బులు ఇచ్చిన వారికే వెళ్తున్నాయని గ్రామస్థులు గతంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్‌కు ఫిర్యాదు అందజేశారు.
దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు అడిషనల్ కలెక్టర్ శనివారం గ్రామాన్ని సందర్శించి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్ సుధాకర్, సివిల్ సప్లై అధికారి ,ఉమ్మడి మండల వ్యవసాయ అధికారి సుదర్శన్ గౌడ్, తహసీల్దార్సురేష్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు గన్ని బ్యాగుల సమస్య ఇంకెన్ని రోజులు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం సంబంధిత అధికారులతో గన్ని బ్యాగులపై చర్చలు జరిపారు. ప్రస్తుతానికి 20 వేల బ్యాగులు ఉన్నాయని, రేపటిలోగా మరో 70వేల బ్యాగులు పంపిస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
రైతుల సమస్యలు పూర్తిగా వినకుండా వెళ్లిపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసినా సమస్యను పరిష్కరించడం లేదని ఆరోపించారు. అక్కడే ఉన్న సంబంధిత అధికారులను రైతులు నిలదీశారు. రైతులు సొంత ఖర్చులు రూ. 5వేల భరిస్తూ ఇతర వాహనాల్లో రైస్ మిల్లులకు పంపిస్తున్నామని తెలిపారు. రైస్‌మిల్ యజమానులు, పీఎస్సీఎస్ సిబ్బంది, లారీ కాంట్రాక్టర్ కుమ్మకై రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు.