అలంపూర్, మే 8 : అలంపూర్ నియోజకవర్గంలో మట్టి దందా జోరందుకున్నది. అనుమతుల పేరుతో అక్రమ మట్టి దందాకు తెరలేపారు. మాఫియా చేతి ముడుపులకు తలూపే కొంత మంది స్వార్థపరులైన అధికారులు వారి మోచేతి నీళ్లు తాగుతున్నారు. రాత్రిల్లే కాకుండా పగలు కూడా దందా చేస్తూ దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ఓ బడా నాయకుడు సంబంధిత శాఖాధికారులతో మాఫియా వారికి సంప్రదింపులు జరిపి ఎవరి వాటా వారికి సెటిల్ చేశారని పుకార్లు వినిపిస్తున్నాయి.
తాజాగా మానవపాడు మండలం పెద్దపోతులపాడులో, ఉండవెల్లి మండలం శేరుపల్లె, అలంపూర్ మండలం ర్యాలంపాడు గ్రామాల్లో మాఫియా మట్టి దందా జోరుగా సాగించడమే. ఇటాచీలు పెట్టి మట్టిని తోడేస్తున్నారు. శేరుపల్లె గ్రామ శివారులో శ్రీశైలం ప్రాజెక్టు ముంపు భూములను స్వాధీనం చేసుకొని ఎర్రమట్టిని 20-40 అడుగుల లోతు వరకు తవ్వుతున్నారు.
నదీ తీరం వెంట ఇలా లోతుగా గుంతలు తీయడం వల్ల మనుషులు, పశువులు ప్రమాదాలకు గురవుతున్నారని గ్రామాల ప్రజలు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు, గోదాంల నిర్మాణాలు, రైల్వే పనులు, గృహ అవసరాల పేరుతో మాఫియా మట్టిని అమ్మి సొమ్ముచేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నది. మట్టి టిప్పర్లు, ట్రాక్టర్లు పగటి పూటనే కాకుండా రాత్రి సమయాల్లో కూడా తిరగడంతో ఆ శబ్దాలకు నిద్రపట్టడం లేదని క్యాతూరులో రోడ్డుపక్కన గల నివాస గృహాల వారు వాపోతున్నారు.
ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చే టిప్పర్లు తెలంగాణ ప్రాంతంలో కనీస ధ్రువీకరణ పత్రాలు లేకుండా తిరుగుతూ అనుమతి లేని మట్టి, ఇసుకను, తరలిస్తుంటే అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అన్ని అనుమతులు ఉండి జాతీయ రహదారులపై రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లే గూడ్స్, ప్యాసింజర్ వాహనాలపై లేని నిబంధల పేరుతో పన్నులు విధించే అధికారులకు అక్రమంగా మట్టి దందాకు పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.