నాగర్‌కర్నూల్, ఆగస్టు 27 : ఎలాంటి షరతుల్లేకుండా వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం నాగర్‌కర్నూల్ జిల్లా ప్రధా న కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం ఆధ్వర్యం లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటికీ రాష్ట్ర వ్యాప్తంగా 55 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ అందలేదన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రూ.31 వేల కోట్లు మాఫీ చేస్తామని ప్రకటించగా.. బడ్జెట్లో కేవలం రూ.26 వేల కోట్లు కేటాయించి.. అందులోనూ రూ.17, 933 కోట్లను మాత్రమే మాఫీ చేసిందన్నారు. ఇంకా రూ.13 వేల కోట్లను అందజేయాల్సి ఉందన్నారు. మాఫీ చేసిన అనంతరం రైతులకు కొత్త రుణాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుంటిసాకులు చెబుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం పలుడిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్‌కు అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు దేశ్యానాయక్, సహాయ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు వెంకటేశ్, మాలిక్, తిరుపతిరెడ్డి, బాలరాజు, రైతు సంఘం నాయకులు కుర్మయ్య, కార్తీక్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట టౌన్, ఆగస్టు 27 : రేషన్‌కార్డు నిబంధనను తొలగించి అర్హులందరికీ రుణమాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్, కార్యదర్శి అంజిలయ్యగౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ పార్క్ వద్ద తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకోవడంతో జిల్లాలో చాలామంది రైతులు రుణమాఫీ అమలుకు నోచుకోలేకపోతున్నారన్నారు. రుణమాఫీ కోసం విడుదల చేసిన జీవో 567ను సవరించాలన్నారు. ధర్నాకు సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల రాం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బాలప్ప మద్దతు తెలిపారు. అనంతరం ధర్నా శిబిరం వద్దకు వచ్చిన తాసీల్దార్ అమరేందర్ కృష్ణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం నాయకులు మహేశ్‌కుమార్‌గౌడ్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి టౌన్, ఆగస్టు 27 : ఇంటింటికి వచ్చి విచారణ చేస్తామని చెప్పి కాలయాపన చేయడం తగదని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాబర్ట్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ.2 లక్షలకు పైగా ఉన్న అప్పును చెల్లిస్తేనే మాఫీ చేస్తామని ఆంక్షలు పెట్టడం తగదన్నారు. పేర్లు తప్పుగా ఉన్నాయని, రేషన్‌కార్డు లేదన్న నెపంతో తప్పించుకోవాలని చూడడం దారుణమన్నారు. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం వల్ల కూడా చాలా మందికి లబ్ధి చేకూరలేదన్నారు.
రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి.. ఇండ్లకు వెళ్లి విచారణ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. అది ఆచరణలో అమలు కావడం లేదన్నారు. ప్రతి మండలంలో వందలకొద్ది రైతులు దరఖాస్తులు చేస్తున్నారన్నారు. అసైన్మెంట్ భూములకు కూడా రుణాలివ్వాలన్నారు. రైతు భరోసా కింద ఏటా ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలని, వానకాలం సీజన్ ముగిసినా ఇప్పటివరకు వాటి ఊసెత్తడం లేదన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ ఎం.నగేశ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్, సీపీఐ నాయకులు రమేశ్, శ్రీహరి, గోపాలకృష్ణ, మహేశ్, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.