అయిజ, ఆగస్టు 13 : వ్యవసాయ పనులు వదిలి రైతులు సింగిల్ విండోల బాటపడుతున్నారు. రోజుల తరబడి రైతులు మండల కేంద్రానికి చేరుకొని క్యూలైన్లలో నిల్చుని ఎరువుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తున్నది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కా ర్యాలయ ఆవరణలో గంటలకొద్ది కళ్లు కా యలు కాసేలా బయోమెట్రిక్, నగదు చెల్లింపులు, యూరియా బస్తాలను తీసుకునేందుకు రోజంతా గడపాల్సి వస్తున్నది. ఎరువుల కొరత ఎక్కడా లేదని సీఎం, మంత్రులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. అయిజ మండలంలో ఆర్డీఎస్, నెట్టెంపాడ్ ప్రాజెక్టులతోపాటు బోర్లు, బా వులు, చెరువుల కింద రైతులు వరి సాగును జోరుగా చేపట్టారు.
ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలో దాదాపు 30 వేల ఎకరాలు వరి సాగు చే స్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వరి, కంది, పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేసిన రైతులకు యూరియా తప్పని సరి. యూరియా కోసం సాగు పనులు వదిలి అయిజ పట్టణంలోని పీఏసీసీఎస్కు చేరుకుంటున్నారు. ఒక్కో ఎకరానికి కనీసం ఆరు బ స్తాల యూరియా అవసరం ఉంటుంది. ఎన్నెకరాల వ్యవసాయ భూమి ఉన్నా రెండు బస్తాలు ఇస్తున్నారు. పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన రైతు తప్పని సరిగా బయోమెట్రిక్ వేయాల్సి రావడంతో కొందరు రైతులు ఇబ్బందులు ప డుతున్నారు.
ప్రభుత్వం అయిజ మండలానికి యూరియాను సరఫరా చేయడంలో విఫలమైందని మండిపడున్నారు. ఒక్కో ఎకరానికి కనీసం 6 బస్తాల యూరియాను ఒకే సారి ఇవ్వాలని కోరుతున్నా, యూరియా కొరత కారణంగా రెండు బస్తాలు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. యూరియా కోసం రైతులు పడుతున్న బాధలను కాంగ్రెస్ గ్రహించడం లే దని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రాథమిక సహకార సంఘాలతోపాటు అగ్రోస్ కేంద్రాలు, ఫర్టిలైజర్ దుకాణాలకు ప్రభుత్వం యూరియాను సరఫరా చేస్తే సొసైటీల దగ్గర రైతుల కష్టాలు తప్పుతాయని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతన్నలు కోరుతున్నారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎరువుల కొరతేలేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అడిగినంత యూరియా, ఎరువులు దొరికేవి. సింగిల్ విండోలతోపాటు ఫర్టిలైజర్ దుకాణాల్లో యూరియా ఎంతైనా దొరుకుతుండేది. కేసీఆర్ హయాంలో రైతులు కష్టాలు పడకుండా ఎరువులను అందుబాటులో ఉంచారు. గతేడాది కాలంగా ఎరువుల దొరకడం లేదు. యూరియా, ఎరువుల కొరత ఉందని చెబుతున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మళ్లీ వెనుకటి రోజులు గుర్తుకొస్తున్నాయి.
– ఈరన్న, ఉప్పల, అయిజ మండలం, జోగుళాంబ గద్వాల జిల్లా
ఎకరాకు ఆరు బస్తాల యూరియా అవసరం ఉంది. 10 ఎకరాల్లో వరిసాగు చేశా. 60 బస్తాల యూరియా కావాలని అడిగితే 2 బస్తాలు ఇస్తాం. మళ్ల కావాలంటే రెండు, మూడు రోజుల తర్వాత వస్తే 2 బస్తాలు ఇస్తాం అని సింగిల్ విండో సిబ్బంది చెబుతున్నారు. 10 ఎకరాలకు 2 బస్తాల యూరియా ఏ విధంగా సరిపోతుంది. పంటకు కావాల్సిన ఎరువులు వేయకపోతే పంట దిగుబడి తగ్గుతుంది. లక్షలు పెట్టుబడులు పెట్టి దిగుబడి తగ్గితే నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచాలి.
– హరికృష్ణ,