ఇటిక్యాల, అక్టోబర్ 15 : రైతులకు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచేందుకుగానూ కేసీఆర్ సర్కారు ఉమ్మడి మండలంలోని ఎర్రవల్లి చౌరస్తా, కోదండాపురం, జింకలపల్లె స్టేజీ వద్ద ఆగ్రోస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే, జింకలపల్లె స్టేజీ వద్ద ఉన్న కేంద్రం పరిధిలోని రైతులు ఎరువులు పొందాలంటే ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రవల్లి చౌరస్తాకు వెళ్లాల్సిందే. జింకలపల్లె వద్ద కేంద్రం ఏర్పాటు చేసిన వ్యక్తికి ఎర్రవల్లి చౌరస్తాలో మరో పెద్ద ఎరువుల దుకాణం ఉండడంతో అక్కడి నుంచే విక్రయిస్తున్నారు. చాలా ఏండ్ల నుంచి ఇదే తతంగం నడుస్తున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా ఇన్చార్జి వ్యవసాయ అధికారి సక్రియానాయక్ను వివరణ కోరగా.. ఆగ్రోస్ కేంద్రంలో ఎరువులు ఇవ్వాలంటే మిషన్లో లాగిన్ అయ్యి.. ఈ-పాస్ ఇవాల్సి ఉన్నందున ఎర్రవల్లి చౌరస్తాలో ఉన్న దుకాణం నుంచి లాగిన్ అయ్యి విక్రయిస్తున్నాడంటూ దుకాణాదారుడికే వంత పాడడం విశేషం. సమస్యను పరిష్కరిచేందుకు కృషి చేస్తానన్నారు. మండలానికే నూతనంగా వచ్చిన ఏవో అలా సేవలందించకూడదని, సెట్ చేసేందుకు సమయం పడుతుందన్నారు.