గద్వాలటౌన్, జూన్ 28 : నాగరికత ఎంత ముందుకు సాగినా…సైన్స్ పరంగా ఎంత అభివృద్ధి సాధించినా…నాగలి లేనిదే పని జరగ దు… దుక్కి దున్నందే తినడానికి తిండి దొరకదు.. రైతు లేనిదే పూట గడవదు, పట్టెడన్నం పుట్టదు..జాతికి వెన్నెముకగా నిలిచిన రైతన్నలు నిర్వహించుకునే పండుగనే ఏరువాక పౌర్ణమి..ఏరువాక అంటారు.. ఎంతో ప్రాముఖ్యత..ప్రత్యేకతలు ఉన్న ఏరువాకను ఘనం గా నిర్వహించుకునేందుకు నడిగడ్డ రైతన్నలు సిద్ధమయ్యారు…కాని ఏరువాక వచ్చినా చినుకు నేల తాకకపోవడంతో కాసింత రైతన్నలు నిరాశలో ఉన్నారు.
వానదేవుడు కరుణించకపోడా వాన కురవదా అన్నట్లు ఎదురుచూస్తున్నారు.. కాలం కలిసి రాకపోదా అం టూ మబ్బులు కమ్మిన ఆకాశం వంకా ప్రతిరోజూ చూస్తూ దేవుడిని వేడుకుంటున్నారు.. ఏరువాక పౌర్ణమి పండుగ నుంచైనా వానలు బాగాపడి రైతన్నలు ఆశలు నెరవేరాలని కోరుకుందాం.. రైతులు ఏరువాక పండుగను జేష్ఠ్య పౌర్ణమి నాడు నిర్వహించుకుంటారు. తెలుగు సంవత్సరంలో జేష్ఠ్యమాసం మూడో నెల. ఈ నెల మొదటి పక్షంలో రోహిణికార్తె తరువాత మృగశిర కార్తె వస్తుంది.
ఈ కార్తెలో ఎండల ప్రభావం తగ్గి ముంగిళ్లు చల్లబడతాయన్న నానుడి ఉంది. అంతేకాదు జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పలుకరించక మానదు. ఇందుకు కృతజ్ఞత పూర్వకంగా జరుపుకొనే పండుగను కృషి పూర్ణిమ, మాల పూర్ణిమ, ఏరువాక పూర్ణిమ అంటారు. ఏరువాక అంటే నాగలితో దుక్కి ప్రారంభించడమన్న అర్థం ఉంది. ఆరుగాలం రైతులకు అన్ని విధాలా అండగా ఉండి పంట పొలాల్లో తమతోపాటు శ్రమించే పశువులను ఏరువాక నాడు పూజిస్తే కాలం కలిసొస్తుందన్న నమ్మకం రైతులది. అందుకే ఏరువాకను ఓ సాంప్రదాయ పండుగగా నిర్వహించుకుంటారు.
పండుగ నిర్వహించుకునే విధానం..
ఆరుగాలం కష్టించే రైతన్నలకు తోడుగా వారి కష్టాల్లో భాగం పంచుకుంటూ అన్ని విధాలా అండగా ఉండే పశువుల(ఎద్దులు)ను ఏరువాక పౌర్ణమి రోజు గ్రామాల్లో ఉదయానే చెరువులు, కుంటల వద్దకు తీసుకెళ్లి స్నానాలు చేయించి వాటి కొమ్ములకు రంగులను పూస్తా రు. కాళ్లకు గజ్జెలు, మెడలో గంటలు, కుచ్చులు కట్టి శరీరం నిండా రంగులు అద్దుతారు. ఆర్థిక స్థోమత ఉన్న రైతులు ఎద్దులను నూతన వస్ర్తాలతో అలంకరించి ఇంట్లో ఉన్న గాటి వద్దకు తీసుకొస్తారు. పండుగ సందర్భంగా చేసిన పొంగలిని నైవేద్యంగా పెట్టి ఆ గాటికి దూప, దీపాలతో పూజలు చేసి చల్లంగా చూడమని వేడుకుంటారు. సాయంకాలం మంగళవాయిద్యాలతో ఊళ్లో ఉన్న పశువులన్నింటిని ఒక దగ్గరకు చేరుస్తారు. అక్కడి నుంచి పశువుల ఊరేగింపు ప్రజల కేరింతల మధ్య కనుల పండుగగా సాగుతుంది. ఎద్దులతోపాటు నాగలిని ఎర్రమట్టి, చున్నం పట్టెలతో అలంకరించి పొలం వద్దకు వెళ్తారు. ఈ ఏడాది రైతు కుటుంబంలో ఎవరి పేరుపైన బలం ఉందో వారు దుక్కి దున్ని పొలం పనులు ప్రారంభిస్తారు.
ఏరువాక తాడు తెంచడం..
దుక్కి దున్నడానికి వెళ్లే ముందు ఊరి పొలిమేరలో పుంటి నారతో తోరణాన్ని కడతారు. ఆ తోరణానికి రూపాయలు, జిలేబీలు, గారెలు, గజ్జెలు తదితర వస్తువులను రైతులు అలంకరిస్తారు. వాటిని చెర కోలతో కొడుతూ ఎవరికి దొరికిన వస్తువును వారు తీసుకెళ్తుంటారు. ఈ విధంగా చేయడం వల్ల పశువులకు మేలు కలుగుతుందని రైతుల నమ్మకం. దీనినే ఏరువాక తాడు తెంచడం అని అంటారు. ఈ ఆచారాన్ని, పండుగను విష్ణు పురాణంలో సీత యజ్ఞంగా పిలువబడేదని ప్రతీతి.
కాసింత నిరాశలో రైతన్నలు..
తెలంగాణలో ఏరువాక వచ్చిన ఏరురాకపాయే అనే నానుడి ఉంది. వానలు సకాలంలో పడక నదుల్లో నీరు చేరక రైతులు కరువు పరిస్థితులను ఎత్తిచూపే బాధతో కూడిన సామెత ప్రస్తుతం ఆ సామెత నిజమైంది. ఏరువాక వచ్చినా చినుకు నేల రాలలేదు. నాటిని విత్తనాలు మొలకెత్తలేదు. రైతుల ఆశలు చిగురించలేదు. దీంతో ఈ ఏరువాక నాడు కాసింత రైతన్నలు నిరాశలో ఉన్నారు. దుక్కులు దున్ని విత్తనాలు నాటా రు. కానీ వానలు రాక విత్తిన విత్తు మొలవక తొలినాళ్లలోనే నష్టాలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరువు పరిస్థితి రాక తప్పదన్న ఆందోళనలో రైతన్నలు ఉన్నారు. ఏరువాక పండుగనాటి నుంచైనా వానలు బాగా కురిసి పంటలు బాగా పండాలని పూజ లు చేసేందుకు రైతన్నలు సిద్ధమయ్యారు. కుల దేవతలకు, గ్రామ దేవతలకు, ఇష్టదైవాలకు పశువులను భక్తి శ్రద్ధలతో కొలిచేందుకు సంసిద్ధులయ్యారు.