అమరచింత : ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న జూరాల ప్రాజెక్టు ( Jurala project ) చెంతనే ఉన్న నందిమల్ల, మూలమల్ల, మస్తీపూర్ తదితర గ్రామాలకు సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ( MLA Vakiti Srihari ) మొర పెట్టుకున్నారు. సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు
. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు సమీపంలో ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యేను నందిమల్ల గ్రామానికి చెందిన రైతులు రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సరోజ నరసింహుల తో పాటు పలువురు రైతులు విజ్ఞప్తి చేశారు. జూరాల ప్రాజెక్టుకు సాగునీరు విడుదల చేసి పొట్ట దశలో ఉన్న తమ పంట పొలాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
ఇంకా 20 రోజులపాటు సాగునీరు విడుదల చేయకపోతే లక్షల ఖర్చుపెట్టి సాగుచేసిన వరి పంట ఇప్పుడు పొట్ట దశలో ఉందని సాగునీరు సకాలంలో పారించకపోతే చేతికి రాకుండా పోతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా మక్తల్ ఎమ్మెల్యే వాకిడి శ్రీహరి జూరాల ప్రాజెక్టు ఎస్ఈకి ఫోన్ చేశారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, రైతుల పంట పొలాలను కాపాడేందుకు లీకేజీ నీటినైనా విడుదల చేయాలని కోరారు.